Share News

కమ్మేసిన పొగమంచు

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:15 PM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. శీతల గాలులు, దట్టంగా పొగమంచు కొనసాగుతున్నాయి.

కమ్మేసిన పొగమంచు
పాడేరు- జి.మాడుగుల మెయిన్‌ రోడ్డులో బుధవారం ఉదయం కమ్మేసిన పొగమంచు

ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గని చలి

వణుకుతున్న ఏజెన్సీ వాసులు

పాడేరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గలేదు. శీతల గాలులు, దట్టంగా పొగమంచు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో బుధవారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరు మొదలుకుని దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ అదే వాతావరణం నెలకొంది. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. చలి తగ్గకపోవడంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు.

అరకులోయలో 10.6 డిగ్రీలు

మన్యంలో చలి వణికిస్తోంది. బుధవారం అరకులోయలో 10.6, ముంచంగిపుట్టులో 11.2, హుకుంపేటలో 11.5, చింతపల్లిలో 12.0, పెదబయలులో 12.1, కొయ్యూరులో 15.3, అనంతగిరిలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జి.మాడుగులలో..

జి.మాడుగుల: మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. బుధవారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. ఉదయం బయటకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బుధవారం వేకువజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు కురుస్తూనే ఉంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచే చలి గాలులు మొదలవుతున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:15 PM