కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:33 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో పొగమంచు దట్టంగా కమ్మేస్తున్నది.
అరకులోయలో 7.7 డిగ్రీలు
పాడేరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో పొగమంచు దట్టంగా కమ్మేస్తున్నది. పాడేరుతో సహా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం పదిన్నర గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉండడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాయి. బుధవారం అరకులోయలో 7.7, జి.మాడుగులలో 8.0, హుకుంపేటలో 8.5, పెదబయలులో 8.5, ముంచంగిపుట్టులో 8.9, చింతపల్లిలో 9.3, కొయ్యూరులో 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికి వణుకుతున్న జనం
ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం పది గంటలు దాటే వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండ కాస్తుండడం, సాయంత్రం 4 గంటల నుంచే చలి గాలులు వీస్తుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉన్ని దుస్తులు ధరించి చలి మంటలు వేసుకుంటూ రక్షణ పొందుతున్నారు. అయితే పర్యాటకులు మన్యానికి వచ్చి చలి, మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.