కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:28 AM
జిల్లాను పొగమంచు కప్పేసింది. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఏజెన్సీని తలపించేలా వంద మీటర్ల దూరంలో ఏముందో కనిపించనంతగా మంచు కురిసింది.
ఏజెన్సీని తలపించిన మైదాన ప్రాంతం
ఉదయం 9 గంటల వరకు వీడని మంచుతెరలు
నెమ్మదిగా ప్రయాణించిన వాహనాలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
జిల్లాను పొగమంచు కప్పేసింది. గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఏజెన్సీని తలపించేలా వంద మీటర్ల దూరంలో ఏముందో కనిపించనంతగా మంచు కురిసింది. చెట్లపై పడిన మంచు.. నీటి బిందువులుగా మారడంతో వర్షం కురిసినట్టుగా నేల తడిచింది. దీనికితోడు శీతల గాలులు వీచడంతో ప్రజలు చలితీవ్రతతో ఇబ్బంది పడ్డారు. ఉన్ని దుస్తులు ధరించి, చలిమంటలు వేసుకొని ఉపశమనం చెందారు. పొలం పనులకు రైతులు, కూలీలు ఆలస్యంగా వెళ్లారు. వాహనదారులు హెడ్‌లైట్లువేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. కాగా పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో మామిడి, జీడిమామిడి పూత మాడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు వారం రోజుల నుంచి పొగమంచు ప్రభావం వున్నప్పటికీ, మంగళవారం మరింత పెరిగిందని రైతులు చెబుతున్నారు.