కమ్మేసిన పొగమంచు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:38 PM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు.
ఉదయం 8 గంటల వరకు వీడని మంచు తెరలు
నర్సీపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు.
నర్సీపట్నంలోని ప్రధాన రహదారులపై మంచు దట్టంగా పరుచుకోవడంతో వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. ఉదయం 8 గంటల వరకు పొగమంచు కురుస్తూనే ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. పెద్ద చెరువుపై మంచు దుప్పటి పరుచుకుంది. కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో చెట్ల పైనుంచి మంచు బిందువులు పడుతుంటే లంబసింగిలో ఉన్న అనుభూతి కలిగిందని స్థానికులు తెలిపారు. అబీద్ సెంటర్, ఎన్టీఆర్ మినీ స్టేడియం ప్రాంగణం పొగమంచుతో కనువిందు చేశాయి.
గొలుగొండ మండలంలో..
కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట, జోగంపేట, ఏఎల్‌పురం, విప్పలపాలెం, గింజర్తి, లింగంపేట, చోద్యం, నాగాపురం, కొంగసింగి, తదితర గ్రామాల్లో శనివారం ఉదయం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8.30 గంటల వరకు పొగమంచు కురుస్తుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. చలి తీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. కొందరు చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందారు.
రావికమతం మండలంలో..
రావకమతం: మండలంలో శనివారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. మంచు ప్రభావం వలన పూత వచ్చే జీడిమామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తేనె మంచు వలన పూతకు ముందు వచ్చే ఎర్ర చిగుర్లు నల్లగా మాడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ మంచు నాలుగైదు రోజుల పాటు ఇలాగే పడితే జీడిమామిడి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. మంచు వలన పొలం పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు చెబుతున్నారు.