Share News

శ్రమించారు.. బాట వేశారు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:36 AM

రహదారి సౌకర్యం లేక మండలంలోని పినకోట పంచాయతీ పందిరిమామిడి, కర్రిమామిడి గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శ్రమించారు.. బాట వేశారు
పందిరిమామిడి, కర్రిమామిడి గిరిజనులు శ్రమదానంతో మట్టి రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్న దృశ్యం

శ్రమదానంతో మట్టిరోడ్డు నిర్మాణం

పందిరిమామిడి, కర్రిమామిడి గిరిజనుల సంకల్ప బలం

అనంతగిరి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేక మండలంలోని పినకోట పంచాయతీ పందిరిమామిడి, కర్రిమామిడి గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లడానికి, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి మార్గం లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో శ్రమదానంతో రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని ఆ రెండు గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. సోమవారం ఆ రెండు గ్రామాలకు చెందిన పది గిరిజన కుటుంబాలు గునపం, పార పట్టుకుని పనిలో దిగారు. బొర్రాపాలెం గ్రామం నుంచి పందిరిమామిడి, కర్రిమామడి గ్రామాలకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండగా, ఒక కిలోమీటరు మేర రోడ్డును నిర్మించుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:36 AM