Share News

చచ్చినా వదలరు!

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:58 AM

కారుణ్య నియామకాల కోసం జీవీఎంసీలో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చచ్చినా వదలరు!

కారుణ్య నియామకాల్లో కాసుల వేట

జీవీఎంసీలో చక్రం తిప్పుతున్న సీనియర్‌ అసిస్టెంట్‌

ఇటీవల 19 మంది జూనియర్‌ అసిస్టెంట్‌లుగా నియామకం

ఒక్కొక్కరి నుంచి రూ.రెండు నుంచి రూ.నాలుగు లక్షలు వసూలు

ప్రజాప్రతినిధి సిఫారసు చేసిన వ్యక్తి నుంచి రూ.2 లక్షలు...

గత ఏడాది అక్టోబరులో నియామకాలు చేపట్టినప్పుడు కూడా అదే పరిస్థితి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కారుణ్య నియామకాల కోసం జీవీఎంసీలో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం ఇవ్వడానికి ప్రతిపాదనలు తయారుచేసింది మొదలు...నియామక ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ పైసల కోసం పీడిస్తూనే ఉంటారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో చేపట్టిన కారుణ్య నియామకాల్లో డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యం ఉన్న పోస్టులు వచ్చేలా చక్రం తిప్పారని, తాజాగా 19 మందిని జూనియర్‌ అసిస్టెంట్‌లుగా నియమించిన వ్యవహారంలో కూడా భారీగానే తీసుకున్నారని జీవీఎంసీలో ప్రచారం జరుగుతోంది.

జీవీఎంసీలో ఉద్యోగం చేస్తూ మృతిచెందినవారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం (కారుణ్య నియామకం) ఇస్తారు. వారి అర్హతలు, అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి అవకాశం కల్పిస్తారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వ్యవహారాలను చూసేందుకు నగర పాలక సంస్థలో ఒక విభాగం ఉంది. ఆ విభాగం అధికారులు, సిబ్బంది ప్రతిపాదనలు తయారుచేసి జీవీఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు. కమిషనర్‌ వాటిని పరిశీలించి, అంతా నిబంధనలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత అవసరమైతే జీవీఎంసీ కౌన్సిల్‌ లేదా ప్రత్యేక అధికారికి పంపించి ఆమోదం లభించిన తర్వాత ఆ ప్రక్రియను పూర్తిచేస్తారు. అయితే పదోన్నతులు, బదిలీల విషయంలో పెద్దగా అవినీతికి ఆస్కారం లేకపోయినప్పటికీ కారుణ్య కోటాలో జరిగే నియామకాలపై మాత్రం ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ విభాగంలో పనిచేస్తున్న ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ కారుణ్య కోటాలో నియామకాలు జరిగిన ప్రతిసారి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు అక్కడి సిబ్బందే ఆరోపిస్తున్నారు. తాను అడిగిన మొత్తం ఇస్తేనే వారికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇవ్వడానికి వీలుగా ప్రతిపాదనలు తయారుచేస్తారని, లేదంటే అటెండర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలకు మాత్రమే అర్హత ఉన్నట్టు ప్రతిపాదనలు పెడుతుంటారని చెబుతున్నారు. గత ఏడాది అక్టోబరులో ఆఫీస్‌ సబార్డినేట్‌, అటెండర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ జరిగింది. ఆ సమయంలో జూనియర్‌ అసిస్టెంట్‌లుగా అర్హత కలిగిన దరఖాస్తుదారులకు సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ నేరుగా ఫోన్‌ చేసి రూ.రెండు లక్షలు ఇస్తే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వస్తుందని, లేకపోతే ఆ పోస్టును వేరేవారికి ఇచ్చేస్తామని బెదిరించారు. తాను అంత ఇచ్చుకోలేనని చెబితే, ఆ డబ్బంతా తానొక్కడికే కాదని, సూపరింటెండెంట్‌, ఏఓ, అదనపు కమిషనర్‌, స్టాండింగ్‌ కమిటీ...ఇలా అందరికీ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ డబ్బులు లేకపోతే అటెండర్‌ పోస్టు వస్తుందని, దానికి రూ.50 వేలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఈ ఫోన్‌ సంభాషణ జీవీఎంసీ అధికారులు, ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపుల్లో అప్పట్లో వైరల్‌ అయింది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఈనెల 25న 19 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌లుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ దఫా కూడా ఒక్కొక్కరి నుంచి రూ.రెండు లక్షలు నుంచి రూ.నాలుగు లక్షలు వరకు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తూ మృతిచెందిన ఒక కార్మికుడి కుమారుడికి కారుణ్య కోటాలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. మృతిచెందిన కార్మికుడు నగరంలోని ఒక ప్రజా ప్రతినిధి వద్ద పనిచేయడంతో, అతని కుమారుడు తనకు జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఉన్నందున, ఆ ఉద్యోగం ఇచ్చేలా అధికారులకు చెప్పాలని సదరు ప్రజాప్రతినిధిని కోరారు. తన వద్ద పనిచేసిన కార్మికుడి కుమారుడు కావడంతో సదరు ప్రజా ప్రతినిధి నాలుగు నెలల కిందట జీవీఎంసీలోని ఒక అదనపు కమిషనర్‌కు ఫోన్‌ చేసి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరారు. దీంతో సదరు అదనపు కమిషనర్‌ ఆ వ్యవహారాలను చూస్తున్న సూపరింటెండెంట్‌తోపాటు సీనియర్‌ అసిస్టెంట్‌ను పిలిచి ప్రజా ప్రతినిధి తనకు ఫోన్‌ చేసిన విషయం చెప్పి, ఆయన సిఫారసు చేసిన వ్యక్తికి జూనియర్‌ అసిస్టెంట్‌ అర్హతలు ఉన్నట్టయితే పరిశీలించి సానుకూలంగా ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ల నియామకానికి సంబంధించిన ఫైల్‌ కమిషనర్‌ నుంచి పది రోజుల కిందటే ప్రత్యేక అధికారికి వెళ్లడం, అక్కడ ఆమోదం పొందడం జరిగిపోయింది. 19 మందికి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఇవ్వడానికి అంతా సిద్ధం కావడంతో సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ ఒక్కొక్క అభ్యర్థిని పిలిచి ఉద్యోగం వచ్చేలా తానే చేశానని, అందుకోసం రూ.నాలుగు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. విషయం బయటకు చెబితే ఉద్యోగం రాదని భయపెట్టడంతో కొందరు అడిగినంత ఇచ్చేయగా, మరికొందరు తమకు తెలిసిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో చెప్పించుకోవడంతో కొంత తగ్గించారని తెలిసింది. నాలుగు నెలల కిందట ప్రజాప్రతినిధి సిఫారసు చేసిన అభ్యర్థి నుంచి కూడా రూ.రెండు లక్షలు వసూలుచేయడం విశేషం. ఈ విషయం ఇటీవల ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వద్ద ప్రస్తావించగా ‘మేము ఇప్పుడే ఉద్యోగం పొందాం. ఆవిషయాలు గురించి అడగొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. కొన్నాళ్లు మమ్మల్ని వదిలేయండి’ అని చెప్పడం విశేషం. కారుణ్య నియామకాల్లో కూడా డబ్బులు కోసం పీడించిన ఉద్యోగులు, అధికారులపై జీవీఎంసీ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jun 28 , 2026 | 12:58 AM