మహిళా మార్టుల్లో మేసేశారు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:47 AM
డ్వాక్రా మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులతో మహిళా మార్టులు పెట్టి, వాటిని నష్టాల్లో ముంచేసిన వెలుగు అధికారుల నిర్వాకంపై, ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగా వుంటున్నాయి. వైసీపీ హయాంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మహిళా మార్టుల్లో ఒక్క మాకవరపాలెం మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. వీటిని పర్యవేక్షించే అధికారులు, వీటిల్లో విధులు నిర్వహించే వారు అవినీతికి పాల్పడడంతో రూ.లక్షల్లో నష్టాలు వచ్చాయి. పెట్టుబడి పెట్టిన డ్వాక్రా మహిళలకు లాభాలను పంచకపోగా, పెట్టుబడిగా పెట్టిన డబ్బులు కూడా తిరిగి దక్కే పరిస్థితి లేకపోయింది.
అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో భారీఎత్తున అక్రమాలు
ఇంటీరియర్ పనులకు అవసరానికి మించి ఖర్చు
సరుకు నిల్వలు, విక్రయాలపై కొరవడిన తనిఖీలు
ఏడాది తిరగకుండానే నష్టాలబాట
మాకవరపాలెం మినహా మిగిలిన మార్టులు మూత
ఒక్కో మార్టులో రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగం
మాడుగులలో మాత్రమే ఆరుగురిపై పోలీసు కేసులు
మిగిలిన మార్టుల నిర్వాహకులపై చర్యలు ఏవీ?
చోడవరం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులతో మహిళా మార్టులు పెట్టి, వాటిని నష్టాల్లో ముంచేసిన వెలుగు అధికారుల నిర్వాకంపై, ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగా వుంటున్నాయి. వైసీపీ హయాంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మహిళా మార్టుల్లో ఒక్క మాకవరపాలెం మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. వీటిని పర్యవేక్షించే అధికారులు, వీటిల్లో విధులు నిర్వహించే వారు అవినీతికి పాల్పడడంతో రూ.లక్షల్లో నష్టాలు వచ్చాయి. పెట్టుబడి పెట్టిన డ్వాక్రా మహిళలకు లాభాలను పంచకపోగా, పెట్టుబడిగా పెట్టిన డబ్బులు కూడా తిరిగి దక్కే పరిస్థితి లేకపోయింది.
గత ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, సబ్బవరం, ఎస్.రాయవరం, మాకవరపాలెం మండలాల్లో మహిళా మార్టులను నెలకొల్పారు. ఇందుకోసం ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి రూ.3 వేలకు తక్కువ కాకుండా పెట్టుబడి డబ్బులు వసూలు చేశారు. ఒక్కో మార్టు ఏర్పాటుకు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధులతోనే ర్యాక్‌లు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేశారు. వీటి కోసం ఒక్కో మార్టుకు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. మహిళా మార్టుల నిర్వహణ కోసం డైరెక్టర్లు, సిబ్బందిని కూడా నియమించారు. వీరిలో అత్యధికులు వైసీపీ మద్దతుదారులు కావడం గమనార్హం. కాగా డ్వాక్రా మహిళలంతా ఈ మార్టుల్లోనే సరుకులు కొనుగోలు చేయాలని అధికారులు ఒత్తిడి చేశారు. మార్టుల్లో కన్నా గ్రామాల్లోని దుకాణాల్లో తక్కువ రేటుకు సరుకులు అందుబాటులో వున్నప్పటికీ అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక మార్టుల్లో సరుకులు కొనుగోలు చేశారు. అయితే మార్టులు ఏర్పాటు చేసిన డీఆర్‌డీఏ అధికారులు వాటిల్లో సరుకు నిల్వలు, విక్రయాల గురించి పట్టించుకోలేదు. కనీసం పర్యవేక్షణ కూడా చేయలేదు. కనీసం తనిఖీలు కూడా చేయలేదు. మార్టుల్లో పనిచేసే సిబ్బందిపై అజమాయిషీ లేకపోవడం వల్ల పెద్దఎత్తున అక్రమాలు జరిగి నష్టాలబాటపట్టాయి. పెట్టిన పెట్టుబడికి, జరిగిన వ్యాపారానికి పొంతన లేకపోవడంతో మాకవరపాలెం మినహా మిగిలినచోట్ల మార్టులు మూతపడ్డాయి. మాడుగులలోని మహిళా మార్టులో జరిగిన అవతవకలపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. అక్కడ వెలుగు సీసీతో పాటు డైరెక్టర్ల నిర్వాకం మూలంగా రూ.21 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల విచారణలో బయటపడింది. దీనితో వెలుగు సీసీతోపాటు, ఐదుగురు సిబ్బంది క్రమశిక్షణ చర్యలు చేపట్టడంతోపాటు, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
చోడవరం మార్టు సంగతేమిటి?
మాడుగుల మహిళా మార్టులో మాదిరిగానే చోడవరం మార్టులో కూడా నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగాయి. కానీ వీటిని అధికారులు ఎవరినీ బాధ్యులుగా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. హోల్‌సేల్‌తోపాటు, రిటైల్ కిరాణా వ్యాపారులు ఎక్కువగా ఉన్న చోడ వరంలో మహిళా మార్టు అవసరం లేదని అప్పట్లో స్థానిక అధికారులు సూచించినప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం పట్టుపట్టి మరీ ఇక్కడ మహిళా మార్టును ఏర్పాటు చేయించారు. సిబ్బంది పనితీరుపై అజమాయిషీ లేకపోవడం వల్ల చాలా వరకు సరుకులు పక్కదారి పట్టినట్టు చెబుతున్నారు. దీంతో నష్టాలపాలై మూతపడింది. సుమారు రూ.40 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన చోడవరం మార్టులో రూ.25 లక్షల వరకు లెక్కలు తేలనట్టు సమాచారం. తమ కష్టార్జితంతో ఏర్పాటు చేసిన మహిళా మార్టులు.. అనతికాలంలోనే నష్టాలబాటపట్టి మూతపడడానికి కారకులైన వారిపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డ్వాక్రా మహిళలు ప్రశ్నిస్తున్నారు.