Share News

శంకుస్థాపనతో సరిపెట్టేశారు

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:45 AM

భీమిలి బీచ్‌రోడ్డులో రామానాయుడు స్టూడియో సమీపాన ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ‘యూనిటీ మాల్‌’ నిర్మాణం పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి.

శంకుస్థాపనతో సరిపెట్టేశారు

ముందుకుసాగని ‘యూనిటీ మాల్‌’ నిర్మాణం

రూ.172 కోట్లు మంజూరుచేసిన కేంద్రం

తొలివిడత రూ.86 కోట్లు విడుదల

పనులు కాని పక్షంలో మురిగిపోయే ప్రమాదం

పట్టించుకోని స్థానిక నాయకులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భీమిలి బీచ్‌రోడ్డులో రామానాయుడు స్టూడియో సమీపాన ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ‘యూనిటీ మాల్‌’ నిర్మాణం పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. మొదటి నుంచి దీని గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. గత ఏడాది మే నెలలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొండను కొద్దిగా తవ్వి చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించారు. అక్కడితో సరి. లోపల ఏ పనులు చేయడం లేదు. అటు చూస్తే ఢిల్లీలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మార్చి నెలాఖరుకే పూర్తి అయిపోతుందని సమాధానం చెబుతున్నారు. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

సుమారు రూ.172 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మాల్‌కు తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులను మార్చి నెలాఖరులోగా ఉపయోగించుకోకపోతే మురిగిపోయే ప్రమాదం ఉంది. దీనిపై ఎంపీ తగిన శ్రద్ధ చూపకపోతే మిగిలిన నిధులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఎందుకు ఈ యూనిటీ మాల్‌?

దేశంలో చేతివృత్తి పనివారికి ప్రత్యేక ఉపాధి, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తూ, వారి నైపుణ్యానికి ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో యూనిటీ మాల్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2023 బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి ప్రతి రాష్ట్రానికి ఒకటి చొప్పున మంజూరుచేశారు. ఏపీకి సంబంధించిన మాల్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఉత్పత్తులు, చేతివృత్తులు, కళాకృతులను ఇక్కడ విక్రయించుకునేందుకు వీలుగా నిర్మాణం డిజైన్‌ చేశారు. మొత్తం 36 షాపులు, ఫుడ్‌ కోర్టులు, ప్రదర్శనశాలలకు ప్లాన్‌ చేశారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో 3.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో గ్రౌండ్‌+4 అంతస్థులు నిర్మించడానికి ప్లాన్‌ ఆమోదించారు. అందులో ‘ఒక జిల్లా...ఒక ఉత్పత్తి’ నినాదంతో ఒక్కో జిల్లాకు ఒక్కో స్టాల్‌ ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్రాకు సంబంధించి పొందూరు ఖాదీ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక బొమ్మలు, మాడుగుల హల్వా, అరకు కాఫీ వంటివి విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేయాలనేది నిబంధన. విశాఖలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి పది నెలలు అయింది. పునాదులు కూడా వేయలేదు. దీని నిర్మాణ బాధ్యతలను ప్రత్యేక అధికారికి అప్పగించి, నిత్యం పర్యవేక్షిస్తే తప్ప పనులు సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

Updated Date - Feb 14 , 2026 | 12:45 AM