పాలీసెట్‌లో సత్తాచాటారు
ABN , Publish Date - May 06 , 2026 | 01:16 AM
పాలీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ముగ్గురు విద్యార్థులు 120/120 మార్కులు సాధించి వరుసగా రాష్ట్రస్థాయిలో 3, 9, 12 ర్యాంకులు కైవసం చేసుకున్నారు.
విశాఖ విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో 3, 9, 12 ర్యాంకులు
కంచరపాలెం, మే 5 (ఆంధ్రజ్యోతి):
పాలీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ముగ్గురు విద్యార్థులు 120/120 మార్కులు సాధించి వరుసగా రాష్ట్రస్థాయిలో 3, 9, 12 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. జిల్లా నుంచి ఈ ఏడాది పాలీసెట్‌కు 14,118 మంది హాజరుకాగా 13,042 మంది ఉత్తీర్ణత సాధించినట్టు కో-ఆర్డినేటర్ డా.కె.వి.రమణ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన జామి చేతన్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించగా, శీలం హేమచంద్ర 9, గొర్లె బాలాదిత్య 12వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
ఐఐటీ మద్రాస్‌లో చేరడమే లక్ష్యం: చేతన్
ఇంటర్ పూర్తిచేసి, జేఈఈలో ర్యాంకు సాధించి ఐఐటీ మద్రాస్‌లో చేరడమే తన లక్ష్యమని మూడో ర్యాంకు సాధించిన చేతన్ చెప్పాడు. పదో తరగతి తగరపువలస వద్ద గల శశిలో చదివి 588 మార్కులు సాధించాడు. ప్రస్తుతం ఇంటర్ కూడా శశిలోనే చదువుతున్నాడు. చేతన్ స్వస్థలం విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గొలజాం. తండ్రి శ్రీనివాసరావు ఎక్స్ ఆర్మీ, తల్లి విజయలక్ష్మి గృహిణి.
ఇంజనీర్ కావాలనుకుంటున్నా: హేమచంద్ర
ఇంటర్ ఎంపీసీ తీసుకుని జేఈఈకి ప్రిపేర్ అవుతానని, మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో సీటు తెచ్చుకోవడమే తన లక్ష్యమని తొమ్మిదో ర్యాంకర్ హేమచంద్ర చెప్పాడు. ఇంజనీర్‌గా స్థిరపడాలనుకుంటున్నట్టు తెలిపాడు. అతను కూడా శశి విద్యార్థే. పదో తరగతిలో 593 మార్కులు సాధించాడు. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి సత్యవతి గృహిణి.
ఐఐఐలో సీటు సంపాదిస్తా...
ఐఐటీ సీటు సంపాదించి శాస్త్రవేత్త కావాలనేది తన లక్ష్యమని 12వ ర్యాంకు సాధించిన బాలాదిత్య చెప్పాడు. అతని తండ్రి రాంప్రసాద్ రైతు.