Share News

నీట్‌లో సత్తాచాటారు

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:47 AM

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన నీట్‌ (యూజీ)లో విశాఖ విద్యార్థులు సత్తాచాటారు.

నీట్‌లో సత్తాచాటారు

జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు సాధించిన జయషణ్ముఖి

ఇంకా 282, 283, 624, 769, 970..

జిల్లాలో సుమారు వెయ్యి మందికి సీట్లు వచ్చే అవకాశం

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన నీట్‌ (యూజీ)లో విశాఖ విద్యార్థులు సత్తాచాటారు. గత నెల 21వ తేదీన రెండోసారి జరిగిన పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి ఎనిమిది వేల మంది హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు గురువారం రాత్రి విడుదల చేశారు. శుక్రవారం రాత్రి వరకు అందిన వివరాల మేరకు నగరంలోని శ్రీచైతన్య మెడికల్‌ అకాడమీలో చదువుకున్న రేలంగి జయషణ్ముజయషణ్ముఖికి ఓపెన్‌ కేటగిరీలో 86వ ర్యాంకు వచ్చింది. ఇదే సంస్థకు చెందిన కె.జ్ఞానవెంకట్‌ 282వ ర్యాంకు, జి.సంపత్‌ దీక్షిత్‌ 283, జె.జస్వంతనాయుడు 624, ఎస్‌.ఉత్తమ రామసాయి 769,కె.సాయిభవ్య 970వ ర్యాంకు సాధించారు. మంచి కోర్సుల్లో సీట్లు వచ్చే ర్యాంకులు సుమారు వెయ్యి మందికి వచ్చాయి. ఎసెంట్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పలు కేటగిరీల్లో 16, 152, 302, 604, 1,039, 1,809, 2,126, 2,609, 2,647, 2,996, 3,621, 4,744 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఇంకా శ్రీవిశ్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పి.సుదీప్తి 1,035వ ర్యాంకు, యు.చంద్రశేఖర్‌ 1156, ఎం.కృష్ణమనోహర్‌ 2,201, పి.శివజ్యోతి 3,564, డి.అనురాధ 3,763, పి.కార్తికేయన్‌ 3,877, టి.జయంతి 4,334వ ర్యాంకులు సొంతం చేసుకున్నారు.


‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’లో జీవీఎంసీకి అవార్డు

డాబాగార్డెన్స్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ కార్యక్రమం అమలులో జీవీఎంసీకి అవార్డు లభించింది. స్థానిక సంస్థలకు శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు సమాచారం అందింది. శుక్రవారం సాయంత్రం ఆయన అమరావతి బయలుదేరి వెళ్లారు. ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ పేరుతో మే 23 నుంచి జూన్‌ 20 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోడ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైనేజీల్లో పూడికతీత, తదితరాలు చేపట్టాలని సూచించింది.


‘ఐ లవ్‌ వైజాగ్‌’’ గాయబ్‌

బీచ్‌ రోడ్డులో సీతకొండ వద్ద మలుపులో జీవీఎంసీ అధికారులు ఏర్పాటుచేసిన ‘ఐ లవ్‌ వైజాగ్‌’ అక్షరాలు మాయమైపోయాయి. విశాఖపట్నం వచ్చే పర్యాటకులు, నగర వాసులు అటువైపు వెళ్లినప్పుడు ఆ అక్షరాల వద్ద నిలబడి ఫొటోలు తీసుకునేవారు. ఇది ఫొటో సెంటర్‌గా మారిపోయింది. ఇటీవల అందులో కొన్ని అక్షరాలు వంగిపోయాయి. అందులో అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు పాడైపోయాయి. దాంతో అధికారులు వాటిని పూర్తిగా తీసేసినట్టు తెలిసింది. త్వరలో కొత్తవి పెడతారని తెలిసింది. పర్యాటకులు ఫొటోలు తీసుకునే సమయంలో అక్షరాలను పట్టుకోవడంతో అవి విరిగిపోతున్నాయనే అంటున్నారు. ఈసారి అలా జరగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

- విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి


దూర విద్య పరీక్షల్లో కాపీయింగ్‌

కళాశాలల యాజమాన్యాలతో పరిశీలకుల కుమ్మక్కు

అధికారులకు అందిన ఫిర్యాదులు

చర్యలు తీసుకునేందుకు నిర్ణయం

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేందుకు సిబ్బందే సహకారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించిన పలు సెమిస్టర్‌ల పరీక్షలు గత నెల 29 నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చే నెల మూడో తేదీ వరకు జరగనున్నాయి. గతంలో అనేకచోట్ల మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈసారి పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ప్రతి కేంద్రానికి పరిశీలకుడి (అబ్జర్వర్‌)ని నియమించారు. అయితే, కొందరు పరిశీలకులు పరీక్ష కేంద్రం కలిగిన కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కైపోయారు. అందుకుగాను సదరు పరిశీలకులకు భారీగానే ముట్టజెప్పినట్టు తెలిసింది. దీంతో గతంలో మాదిరిగానే మాస్‌ కాపీయింగ్‌ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి కొందరు తీసుకువచ్చారు. ఆయా అంశాలను సునిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ తరహా ఆరోపణలు వస్తున్న పరిశీలకులను వేరే ప్రాంతానికి మార్చేందుకు/తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్న కళాశాలలకు ఒకరు కాకుండా ఇద్దరు పరిశీలకులను, స్పెషల్‌ స్క్వాడ్‌లను పంపిస్తామంటున్నారు.

ప్రతి కాలేజీకి అబ్జర్వర్‌

ప్రస్తుతం దూర విద్య కేంద్రం నిర్వహిస్తున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 76 వేల మంది హాజరవుతున్నారు. వారి కోసం మొత్తం 85 పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. వీరిలో కొందరి వ్యవహారంపై ఫిర్యాదులు వస్తుండడంతో స్పెషల్‌ స్క్వాడ్స్‌ను పంపిస్తున్నామని దూర విద్యా కేంద్రం అధికారులు తెలిపారు.

Updated Date - Jul 18 , 2026 | 01:47 AM