Share News

ఐక్యంగా కదిలారు.. బడికి గూడు కట్టారు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:14 AM

ఎవరో వస్తారు... ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ గ్రామంలోని బడికి సొంతంగా అవసరమైన గూడును సమకూర్చి ఆదర్శంగా నిలిచారు పాడేరు మండలంలోని ఉరుగొండ గ్రామస్థులు.

ఐక్యంగా కదిలారు.. బడికి గూడు కట్టారు
పాఠశాలకు శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్న గ్రామస్థులు

66 మంది విద్యార్థులకు ఒకటే భవనం

వసతి చాలక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇక్కట్లు

సొంత నిధులతో షెడ్డును నిర్మించిన గ్రామస్థులు

ఉరుగొండ ఎస్‌ఎంసీ ప్రతినిధుల ప్రత్యేక చొరవ

పాడేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

మండలంలో కించూరు పంచాయతీ ఉరుగొండ గ్రామంలోని మండల పరిషత్‌ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో 66 మంది విద్యార్థులున్నారు. కాని అక్కడ ఒకటే భవనం ఉండడంతో విద్యార్థులందరికీ వసతి చాలని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గుర్తించిన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ అడపా చామంతినాయుడు, వైస్‌చైర్మన్‌ కొర్రా జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులతో చర్చించి అదనపు వసతి సమకూర్చాలని నిర్ణయించారు. దీంతో వారంతా ఐక్యంగా శ్రమించి, అవసరమైన నిర్మాణ సామగ్రిని సొంత సొమ్ముతోనే కొనుగోలు చేసి, పాఠశాలకు ఒక రేకుల షెడ్డును నిర్మించారు. దీంతో పాత భవనంలో 1,2,3 తరగతులు నిర్వహిస్తే, కొత్త రేకుల షెడ్డులో 4, 5 తరగతులను నిర్వహిస్తున్నారు. తమ గ్రామంలోని పాఠశాలకు అదనపు వసతిని సమకూర్చేందుకు కృషి చేసిన ఎస్‌ఎంసీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులకు పాఠశాల హెచ్‌ఎం పి.స్వామినాయుడు, వి.కొండలరావు, ఎస్‌.ఈశ్వరరావు, కె.సింహాచలం ధన్యవాదాలు తెలిపారు. ఉరుగొండ ఎస్‌ఎంసీ ప్రతినిధుల ప్రత్యేక చొరవను పలువురు ప్రశంసించారు.

Updated Date - Oct 04 , 2026 | 12:14 AM