తెగ తాగేశారు!
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:37 AM
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజులతోపోలిస్తే రెండు రెట్లు అధికంగా మద్యం వ్యాపారం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ మందుబాబులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు వుండడం కూడా మద్యం అమమ్మకాలు పెరగడానికి దోహదపడింది.
నూతన సంవత్సరం సందర్భంగా ఏరులై పారిన మద్యం
డిసెంబరులో రూ.101.84 కోట్ల అమ్మకాలు
2024లో ఇదే నెలలో రూ.93.64 కోట్లు...
అనకాపల్లి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజులతోపోలిస్తే రెండు రెట్లు అధికంగా మద్యం వ్యాపారం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ మందుబాబులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు వుండడం కూడా మద్యం అమమ్మకాలు పెరగడానికి దోహదపడింది. బుధవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. గురువారం కూడా ఇదే ఒరవడి కొనసాగింది. స్నేహితులు, బంధువులు బృందాలుగా ఏర్పడి.. తమకు అనువైన ప్రదేశాల్లో మద్యం, విందు, వినోదాలతో అర్ధరాత్రి దాటే వరకు ఉల్లాసంగా గడిపారు. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. జిల్లాలో 153 మద్యం దుకాణాలు, ఐదు రెస్టారెండ్ అండ్ బార్లు వున్నాయి. 2024 డిసెంబరుతో పోలిస్తే 2025 డిసెంబరులో మద్యంలో విక్రయాలు 8.8 శాతం పెరిగినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 2024 డిసెంబరులో 1,24,078 కేసుల లిక్కర్, 46,890 కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. వీటి విలువ రూ.93.64 కోట్లు. ఇక 2025 డిసెంబరులో 1,37,244 లిక్కర్ కేసులు, 64,313 బీరు కేసులు అమ్ముడుపోయాయి. వీటి విలువ రూ.101.84 కోట్లు అని అధికారులు వెల్లడించారు. 2024తో పోలిస్తే రూ.8.2 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి.
ఒక్క రోజే రూ.6.34 కోట్ల మద్యం అమ్మకాలు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబరు 31వ తేదీన మద్యం అమ్మకాలు అధికంగా వుండడం సాధారణమే. అయితే సాధారణ రోజులతోపోలిస్తే రెండు, మూడురెట్లు అధికంగా వ్యాపారం జరిగింది. 31వ తేదీన 8,178 కేసుల మద్యం, 4,959 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ రూ.6.34 కోట్లుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.