తెగ తాగారు
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:21 AM
మందుబాబులు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగానే జరుపుకున్నారు.
రెండు రోజుల్లో రూ.19 కోట్ల మద్యం విక్రయాలు
సాధారణ రోజుల్లో రోజుకు రూ.5 కోట్ల అమ్మకాలు
పండుగతో రెట్టింపు వ్యాపారం
విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):
మందుబాబులు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగానే జరుపుకున్నారు. గురు, శుక్రవారాల్లో రూ.19 కోట్ల విలువైన మద్యం తాగేశారు. సంక్రాంతి ఒక్కరోజే అంటే గురువారం పది కోట్ల రూపాయల విలువైన మద్యం కొనుగోలు చేశారు. రెండో రోజు కనుమ పండుగనాడు మరో రూ.9 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఈ రెండు రోజుల్లోనే నగరంలో రూ.19 కోట్ల వ్యాపారం జరగడం విశేషం.
వాస్తవంగా చూసుకుంటే రోజుకు నగరంలో రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయి. రెండు రోజులకు కలిపి రూ.10 కోట్ల నుంచి రూ.11 కోట్ల వ్యాపారం జరగాల్సి ఉండగా, రూ.19 కోట్లు విక్రయాలు చేశారు. అంటే దగ్గర దగ్గర రెట్టింపు విక్రయాలు జరిగాయి. నగరంలో 159 మద్యం షాపులు, 75 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు నగరంలోని 16 స్టార్ హోటళ్లలోను లైసెన్స్‌డ్ బార్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ ఖరీదైన మద్యం ఉంటుంది. విశాఖపట్నం చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం ప్రభుత్వం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఐదు ప్రాంతాల్లో చిన్న సైజు బార్లు ఏర్పాటుచేసింది. వాల్తేరు క్లబ్, సెంచురీ క్లబ్ వంటి ఏడు క్లబ్బుల్లోను మద్యం ఉంది. ఇవికాకుండా నచ్చిన బ్రాండ్ ఎంచుకొని, కారులో వెళ్లి కొనుక్కోవడానికి వీలుగా రెండు ప్రీమియం షాపులను కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటుచేశారు. వీటన్నింటి ద్వారా రెండు రోజుల్లో రూ.19 కోట్ల విలువైన మద్యం విక్రయించారు.