Share News

పరీక్షలు పెట్టారు.. ఫలితాలు మరిచారు!

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:59 AM

ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.

పరీక్షలు పెట్టారు.. ఫలితాలు మరిచారు!

ఐదు నెలల నుంచి బీఈడీ విద్యార్థుల నిరీక్షణ

గత ఏడాది నవంబరు మొదటి వారంలో మూడో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ

ఇంతవరకు ఫలితాలు విడుదల చేయని వర్సిటీ అధికారులు

నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) :

ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించడం.. ఫలితాల కోసం నెలల తరబడి విద్యార్థులు నిరీక్షించేలా చేయడం అధికారులకు పరిపాటిగా మారింది. అనేక కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను నెలల తరబడి విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళనలు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే బీఈడీ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..

గత ఏడాది నవంబరు మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు బీఈడీ మూడో సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఏయూ పరిధిలోని బీఈడీ కళాశాలలకు చెందిన సుమారు రెండు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయి ఐదు నెలలు దాటిపోయింది. కానీ ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆయా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పైగా మూడో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేయని అధికారులు.. నాలుగో సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలుత నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ఈ నెల ఏడో తేదీ నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఏయూ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను మార్పు చేశారు. మూడో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేయకుండా నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించడంపై పలువురు విద్యార్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొరవడిన స్పష్టత

బీఈడీ మూడో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని ఎగ్జామినేషన్‌ సెక్షన్‌ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అధికారులను కలిసి, పరీక్షలు నిర్వహించి ఐదు నెలలు గడిచినా ఫలితాలు విడుదల చేయలేదని చెప్పగా.. వారు సైతం చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా సమాధానాలు చెబుతున్నారని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏయూ ఎగ్జామినేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ చిట్టిబాబును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. బీఈడీ మూడో సెమిస్టర్‌ పరీక్షల ప్రశ్నాపత్రాల రికార్డు వాల్యూయేషన్‌ ఆలస్యం కావడం వల్ల ఫలితాల విడుదలలో జాప్యం జరిగిందన్నారు. వాల్యూయేషన్‌ ప్యానెల్‌ను తరచూ మార్చడం వల్ల కొంత మేర అసౌకర్యం కలిగిందని, కొద్దిరోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు.


దాహార్తిని తీర్చేలా..

నగరంలో 108 చలివేంద్రాలు

53చోట్ల గ్రీన్‌ షెల్టర్లు

రూ.1.53 కోట్లు కేటాయించిన జీవీఎంసీ

15వ తేదీ నుంచి అందుబాటులోకి...

విశాఖపట్నం, ఏప్రిల్‌ 12 (ఆంఽధ్రజ్యోతి):

వేసవి కారణంగా ఎండతీవ్రత పెరిగిన నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయట వచ్చేవారికి ఉపశమనం కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1.53 కోట్లతో చలివేంద్రాలు, గ్రీన్‌షెల్టర్‌లు ఏర్పాటు చేయనున్నట్టు చీఫ్‌ ఇంజనీర్‌ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఏటా వేసవిలో వడదెబ్బ, వడగాడ్పుల నుంచి నగరవాసులకు రక్షణ కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు చలివేంద్రాలు, గ్రీన్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌ చివరి వారం నుంచి ఎండల తీవ్రత, వడగాడ్పుల ప్రభావం అధికంగా వుంటుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ వడగాడ్పులు వీస్తుండడంతో రహదారులపై జనసంచారం తగ్గిపోతున్నది. వివిధపనులపై బయటకు వెళ్లేవారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని బస్టాపుల వద్ద షెల్టర్లు లేకపోవడంతో బస్సుల కోసం వేచివుండే వారు మండుతున్న ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో నగరవ్యాప్తంగా 108 చలివేంద్రాలు, 53 చోట్ల గ్రీన్‌షెల్టర్‌లు ఏర్పాటుచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. తాటాకులతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క దానిలో రెండు మట్టి బానల్లో నీరు, గ్లాసులు, ప్లాస్టిక్‌ డ్రమ్మును ఉంచుతారు. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి, కొంతసేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కన ముఖ్యమైన ప్రాంతాల్లో గ్రీన్‌క్లాత్‌మ్యాట్‌లతో షెడ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

ఏ జోన్‌లో.. ఎన్నెన్ని..

భీమిలి జోన్‌లో 11 చలివేంద్రాలు, మూడు గ్రీన్‌షెల్టర్లు, మధురవాడ జోన్‌లో 15 చలివేంద్రాలు, రెండు గ్రీన్‌షెల్టర్‌లు, తూర్పుజోన్‌ పరిధిలో 26 చలివేంద్రాలు, ఐదు గ్రీన్‌షెల్టర్‌లు, ఉత్తరజోన్‌ పరిధిలో 34 చలివేంద్రాలు, మూడు గ్రీన్‌షెల్టర్‌లు, సౌత్‌జోన్‌ పరిధిలో 45 చలివేంద్రాలు, నాలుగు గ్రీన్‌షెల్టర్‌లు, వెస్ట్‌జోన్‌ పరిధిలో 15 చలివేంద్రాలు, నాలుగు గ్రీన్‌షెల్టర్‌లు, పెందుర్తి జోన్‌ పరిధిలో 11 చలివేంద్రాలు, ఒక గ్రీన్‌షెల్టర్‌, గాజువాక జోన్‌ పరిధిలో 19 చలివేంద్రాలు, తొమ్మిది గ్రీన్‌షెల్టర్‌లు, అగనంపూడి జోన్‌ పరిధిలో ఏడు చలివేంద్రాలు, ఏడు గ్రీన్‌షెల్టర్‌లు, అనకాపల్లి జోన్‌ పరిధిలో 15 చలివేంద్రాలు, 14 గ్రీన్‌షెల్టర్‌లు ఏర్పాటు చేయనున్నట్టు సీఈ సత్యనారాయణరాజు తెలిపారు.

Updated Date - Apr 13 , 2026 | 12:59 AM