ఓటెత్తారు!
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:20 AM
జిల్లాలో పరిషత్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ పోలింగ్ నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఓటింగ్ జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
- ప్రశాంతంగా పరిషత్ ఎన్నికలు
- జిల్లాలో 61.71 శాతం పోలింగ్
- మొత్తం ఓటర్లు 4,98,465 మంది
- ఓటు హక్కు వినియోగించుకున్నది 3,07,589 మంది
- స్ర్టాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్స్‌లు భద్రం
పాడేరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిషత్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 11 జడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ పోలింగ్ నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఓటింగ్ జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
జిల్లాలో మొత్తం 4,98,465 మంది ఓటర్లకు గాను 3,07,589 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ 61.71 శాతంగా అధికారులు ప్రకటించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని మండల కేంద్రాల్లోనూ బంద్ వాతావరణం నెలకొంది. జనమంతా ఓట్లేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఉండడంతో ప్రధాన మార్గాలన్నీ నిర్మూనుష్యంగా మారాయి. అలాగే పోలింగ్ అనంతరం ఆయా ప్రాంతాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించి అక్కడే భద్రపరిచారు. ఎన్నికల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఏజెన్సీలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో పోలీసులు, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకున్నారు.
జిల్లాలో 61.71 శాతం పోలింగ్
జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల్లో 61.71 శాతం పోలింగ్ జరిగింది. వాస్తవానికి గిరిజన ప్రాంతంలో రాజకీయ చైతన్యం పెరుగుతున్న తరుణంలో ఈ దఫా పరిషత్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని అందరూ భావించినట్టుగానే జరిగింది. 2021 పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 55.08 శాతం పోలింగ్ జరగడంతో ఈసారి 60 శాతం కచ్చితంగా చేరుకుంటుందని రాజకీయ పరిశీలకులు భావించారు. గతంలో కంటే ఏజెన్సీలో ఎన్నికలపై ఆసక్తి పెరగడంతో పాటు పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావడంతో రాజకీయ పదవులపై అందరి దృష్టిపడింది. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవి నేపథ్యంలో జడ్పీటీసీ స్థానాలపై, ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని ఎంపీటీసీ స్థానాలకు పోటీ పెరిగింది. ఫలితంగానే జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాలేదు.
పోలింగ్‌ను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు
జిల్లాలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ జిల్లాలోని మారుమూల ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తొలుతగా కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో పోలింగ్ కేంద్రాల ఫుటేజ్‌లను పరిశీలించి, మండల రిటర్నింగ్ అఽధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తరువాత జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలు, హుకుంపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె స్వయంగా పరిశీలించారు. అలాగే ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ కె.సాహిత్ పలు పోలింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్ చైర్‌లను అందుబాటులో ఉంచారు.
జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ వివరాలు
వ.సం మండలం మొత్తం ఓటర్లు పోలైన ఓటర్లు పోలింగ్ శాతం
1. అనంతగిరి 38,286 25,030 65.38
2. అరకులోయ 42,725 29,246 68.45
3. చింతపల్లి 65,374 34,155 52.25
4. డుంబ్రిగుడ 38,743 27,443 70.83
5. జీకేవీధి 52,412 28,057 53.53
6. జి.మాడుగుల 44,674 26,263 58.79
7. హుకుంపేట 45,787 31,177 68.09
8. కొయ్యూరు 43,711 26,336 60.25
9. ముంచంగిపుట్టు 38,895 24,752 61.45
10. పాడేరు 44,536 28,929 64.96
11. పెదబయలు 43,322 26,201 60.48
-----------------------------------------------------------------------------------------------
మొత్తం 4,98,465 3,07,589 61.71
-----------------------------------------------------------------------------------------------