నిర్మించారు.. వదిలేశారు..
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:12 AM
జిల్లా రైతులకు అవసరమైన విత్తనాల సరఫరా కోసం మండలంలోని గంధవరంలో నిర్మించిన విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటి నిర్మాణ పనులు సుమారు ఆరు నెలల క్రితం పూర్తిగా, మూడు నెలల క్రితం విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తామని, విత్తనాల సరఫరా ఇక్కడ నుంచే చేపడతామని అధికారులు పలుమార్లు ప్రకటించారు.
ప్రారంభోత్సవానికి నోచుకోని విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం
ఆరు నెలల క్రితమే నిర్మాణం పూర్తి
మూడు నెలల కిందట విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగింత
ఈ ఏడాది ఖరీఫ్‌కు ఇక్కడి నుంచే విత్తనాలు సరఫరా చేస్తామన్న అధికారులు
ఎప్పటి మాదిరిగానే పొరుగు జిల్లా నుంచి సరఫరా
చోడవరం, జూన్ 25 (ఆంఽధ్రజ్యోతి): జిల్లా రైతులకు అవసరమైన విత్తనాల సరఫరా కోసం మండలంలోని గంధవరంలో నిర్మించిన విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటి నిర్మాణ పనులు సుమారు ఆరు నెలల క్రితం పూర్తిగా, మూడు నెలల క్రితం విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తామని, విత్తనాల సరఫరా ఇక్కడ నుంచే చేపడతామని అధికారులు పలుమార్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు ప్రారంభించలేదు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా విజయనగరం జిల్లాలోని గోదాముల నుంచి విత్తనాలను జిల్లాకు రప్పించి, రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేశారు. వైసీపీ అధికారంలో వున్నంత కాలం విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రం నిర్మాణం పునాదులకే పరిమితం అయ్యిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శరవేగంగా నిర్మాణం పూర్తయినప్పటికీ అందుబాటులోకి తీసుకురాకుండా నిరుపయోగంగా ఉంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అధికారికంగా విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించడం ఆలస్యమైతే, ఖరీఫ్ సీజన్ నుంచే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తామని విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు గతంలో ప్రకటించారు. కానీ దీనిని అమలు చేయలేదు. సుమారు రూ.4.7 కోట్ల వ్యయంతో, 40 వేల క్వింటాళ్ల సామర్థ్యంతో నిర్మించిన విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి జరగనందుకు బాధపడేవారమని, ఇప్పుడు కూటమి పాలనలో చేసిన అభివృద్ధి పనులు వినియోగంలోకి రాకపోవడం బాధాకరమని అంటున్నారు.