Share News

అప్పనంగా దోచిపెడుతున్నారు

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:00 AM

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాంట్రాక్టులన్నీ ఇప్పుడు విజయవాడ నుంచి అందే ఆదేశాల మేరకు ఖరారు చేస్తున్నారు.

అప్పనంగా దోచిపెడుతున్నారు

సింహగిరిపై హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్టర్‌కు గతంలో నెలకు రూ.16 లక్షల చెల్లింపు

ఇప్పుడు రూ.40 లక్షలు...

ఒక్కసారిగా 150 శాతం పెరుగుదల

స్థానిక అధికారుల అభ్యంతరం...విజయవాడ నుంచి ఆదేశారావడంతో చెల్లింపు

ఇప్పుడు సెక్యూరిటీ కాంట్రాక్టు కూడా అదేవిధంగా ఇచ్చేందుకు యత్నం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాంట్రాక్టులన్నీ ఇప్పుడు విజయవాడ నుంచి అందే ఆదేశాల మేరకు ఖరారు చేస్తున్నారు. బిల్లులు రెట్టింపు అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్ట్‌ బిల్లు అమాంతం 150 శాతం పెరగ్గా తాజాగా సెక్యూరిటీ కాంట్రాక్టును కూడా అక్కడి నుంచే ఖరారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సింహాచలంలో అనేక పనులు కాంట్రాక్టు విధానంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ద్వారా చేయిస్తుంటారు. హౌస్‌ కీపింగ్‌ పనులు కూడా అలాగే జరుగుతుంటాయి. కొండపై ఆలయం, పరిసరాలు, కాటేజీలు, సత్రాలు, అక్కడి బాత్‌రూమ్‌లు అన్నీ ప్రతి రోజూ శుభ్రం చేసి, చెత్తను అక్కడి నుంచి తరలించాలి. ఆలయ పరిసరాలన్నీ నిత్యం పరిశుభ్రంగా ఉంచాలి. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సుమారు 80 మందితో పనులు చేయిస్తారు. వారికి గత జూలై వరకు నెలకు రూ.16 లక్షల వరకు బిల్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఇదే పనులకు, అదే మనుషులకు నెలకు రూ.42 లక్షల వరకు బిల్లు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్‌ మారిపోయారు. అంత మొత్తం ఒకేసారి ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే అధికారుల నుంచి సమాధానం లేదు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కీలకమైన దేవస్థానాలన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలుస్తున్నారు. అందులో విజయవాడ నుంచి ఎంపిక చేసిన సంస్థకే పనులు కట్టబెడుతున్నారు. ఎంత మొత్తం అనేది విజయవాడలో ఉన్నతాధికారులు నిర్ణయిస్తున్నారు. ఆ విధంగానే ఇటీవల హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చేశారు. ఆ బిల్లు ఒకేసారి 150 శాతం ఎక్కువగా ఉండడంతో ఇక్కడి అధికారులు దానిని మంజూరు చేయడానికి నిరాకరించారు. ఆ విషయం కాంట్రాక్టర్‌ విజయవాడలోని దేవదాయ ప్రధాన కార్యాలయంలో చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. బిల్లు ఎంత పెడితే అంత మొత్తం మంజూరుచేయాలని ఆదేశించినట్టు తెలిసింది. దాంతో వెంటనే రూ.42 లక్షలు ఇచ్చేశారు. సిబ్బంది ఏ మాత్రం పెరగకపోయినా, పరిశుభ్రం చేయాల్సిన ఆవరణలు అదనంగా లేకపోయినా బిల్లింగ్‌ ఎందుకు ఎక్కువ చేశారని అడగాలని ఉన్నా స్థానిక అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే...కాంట్రాక్టర్లు ఎందరు మారినా పనిచేసే సిబ్బంది మాత్రం వారే ఉంటారు. కాంట్రాక్టర్‌ మారినప్పుడల్లా యూనిఫామ్‌ మాత్రమే మారుతుంది. కాంట్రాక్టర్‌కు ఇచ్చే బిల్లు పెరిగిందే తప్ప సిబ్బంది వేతనాలు మాత్రం పెరగలేదు. ఈ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కాకుండా గతంలో కొండపై నివాసం ఉన్న గిరిజనులను తరలించినప్పుడు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి, వారిలో 40 మందితో ఈ పనులే చేయిస్తున్నారు. వారికి సొసైటీ ఏర్పాటుచేసి, కనీస వేతనాలు ఇస్తున్నారు. తాజాగా దేవస్థానం సెక్యూరిటీ కాంట్రాక్టును కూడా విజయవాడ నుంచే ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. అన్ని దేవాలయాల్లో సెక్యూరిటీ కాంట్రాక్టును కూడా ఒకరికే గంపగుత్తగా ఇస్తున్నట్టు తెలిసింది. ఈ కాంట్రాక్టర్లకు రాజకీయ నేతలు, ఇటు దేవదాయ శాఖ అధికారులు ఆశీస్సులు ఉన్నాయని సమాచారం.

Updated Date - Sep 18 , 2026 | 01:00 AM