Share News

గ్యాస్‌కు కొరత లేదు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:53 AM

జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, గృహ వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి సూచించారు.

గ్యాస్‌కు కొరత లేదు

ఆందోళన చెందొద్దు

జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి

సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, గృహ వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి సూచించారు. ఆమె అధికారులతో శనివారం ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో గ్యాస్‌ కొరతపై వస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. తగినంత నిల్వలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం గృహ వినియోగం, ఆస్పత్రులు, హాస్టళ్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, ఆయా వర్గాలకు యథా ప్రకారం సరఫరా చేస్తున్నదన్నారు. వాణిజ్య అవసరాలకు మాత్రం కేంద్రం సూచన ప్రకారం 20 శాతం ఇస్తున్నారని, త్వరలో అది కూడా మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. చాలామంది గ్యాస్‌ దొరకదేమోనని భయంతో అవసరం లేకున్నా బుక్‌ చేసుకుంటున్నారని, అందుకే ఏజెన్సీల వద్ద ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఒకసారి సిలిండర్‌ బుక్‌ చేసుకున్న తరువాత మరో 25 రోజులు ఆగాకే బుకింగ్‌ జరుగుతుందని, ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. గ్యాస్‌ డెలివరీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఓటీపీ చెప్పాలని, అది లేకుండా ఎక్కడైనా సిలిండర్‌ డెలివరీ జరిగితే అక్రమమని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. డొమెస్టిక్‌ సిలిండర్లు ఎవరైనా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


నేడు ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్ష

700 కేంద్రాల్లో 70,090 మంది అభ్యర్థులు హాజరు

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ప్రాతమిక స్థాయి అక్షరాస్యత పరీక్ష (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 70,090 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఇందుకోసం మండలాలు, జోన్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 700 కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విశాఖను శతశతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు.


కార్డియాలజీకి కొత్త పరికరాలు

కేజీహెచ్‌కు హార్ట్‌, లంగ్‌ మెషీన్‌, టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌

రూ.2 కోట్లతో కొనుగోలు

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్‌) కింద అందిస్తున్న ఐసీఐసీఐ బ్యాంకు

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో కీలకమైన కార్డియాలజీ విభాగానికి సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణలో కీలకమైన హార్ట్‌, లంగ్‌ మెషీన్‌, టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌తోపాటు మరికొన్ని పరికరాలు పాడవ్వడంతో గత ఏడాది కొన్ని నెలలపాటు సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు రావడంతో ఆస్పత్రి అధికారులు, జిల్లా కలెక్టర్‌ స్పందించి...రెండు మెషీన్‌లను ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుని శస్త్ర చికిత్సలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, నెలకు రూ.1.5 లక్షల అద్దె చెల్లింపు ఆస్పత్రికి భారంగా మారుతుండడంతో సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి, అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ పరికరాలను కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను సంప్రతించారు. ఈ క్రమంలో సుమారు రూ.2 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు మంజూరుచేశారు. ఈ మొత్తంతో హార్ట్‌ లంగ్‌ మెషీన్‌, టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌తోపాటు ఇతర పరికరాలను కొనుగోలు చేశారు. ఇవి ఈ నెల 15వ తేదీ నాటికి కార్డియాలజీ విభాగానికి చేరుకుంటాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.

అత్యంత కీలకం

హార్ట్‌, లంగ్‌ మెషీన్‌ను గుండె, ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా యంత్రం ద్వారా నిర్వహించేందుకు వినియోగిస్తారు. ఈ యంత్రం రోగి శరీరం నుంచి రక్తాన్ని తీసుకుని కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌ను కలిపి తిరిగి లోనికి పంపించేందుకు దోహదం చేస్తుంది. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, గుండె వాల్వ్‌ మార్పిడి, బైపాస్‌ సర్జరీ, పుట్టుకతో గుండె లోపాల శస్త్రచికిత్సల నిర్వహణ సమయంలో దీనిని వినియోగిస్తారు. అలాగే, టెంపరేచర్‌ కంట్రోల్‌ మెషీన్‌ను శస్త్రచికిత్స సమయంలో రోగి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి వినియోగిస్తారు. ఈ పరికరాలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రికి అదనపు భారం తగ్గుతుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి వెల్లడించారు. కలెక్టర్‌ కృషితో విభాగానికి కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని అడ్మినిస్ర్టేటర్‌ బీవీ రమణ వెల్లడించారు.


తిరుపతి, షిర్డీ రైళ్లు ఫుల్‌

రెగ్యులర్‌ డిమాండ్‌కు తోడైన వేసవి రద్దీ

తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో మే 5 వరకు, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో ఏప్రిల్‌ 30 వరకూ నో బెర్త్‌

భువనేశ్వర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లోనూ అదే పరిస్థితి

విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

వేసవిలో తిరుమల వెంకటేశ్వరస్వామి, షిర్డీ సాయినాథుని దర్శనానికి వెళ్లాలనుకున్న వారికి రైళ్లలో బెర్తులు లభించడం గగనంగా మారింది. షిర్డీ వెళ్లేందుకు కేవలం వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ప్రయాణికుల అవసరాలు తీరడం లేదు. ప్రతి గురువారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503)కు, అలాగే ప్రతి ఆదివారం విశాఖ నుంచి రాయగడ మీదుగా మన్మాడ్‌ జంక్షన్‌కు నడిచే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (22847)కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. ఇక తిరుపతి వెళ్లేందుకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521), హౌరా-బెంగళూరు (12863), పూరి-తిరుపతి, బిలాస్‌పూర్‌-తిరుపతి, వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22504) వంటి డైలీ రైళ్లతోపాటు వారాంతపు, బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుండడంతో ప్రయాణికులు ఆశించిన తేదీల్లో బెర్తులు పొందలేని పరిస్థితులు నెలకొన్నాయి.

మే 5 వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఫుల్‌

ఏడాది పొడవునా రద్దీగా ఉండే తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు వేసవి సెలవులు తోడవ్వడంతో మరింత డిమాండ్‌ ఏర్పడింది. దీంతో తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు మే ఐదో తేదీ వరకు బెర్తులు నిండిపోయాయి. అన్ని ఏసీ క్లాస్‌లతోపాటు స్లీపర్‌ క్లాసు కోచ్‌లకు కూడా నిరీక్షణ జాబితా ఏర్పడింది.

భువనేశ్వర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లలో...

విశాఖ మీదుగా భువనేశ్వర్‌ నుంచి తిరుపతి వెళ్లే వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లలో మే 2 వరకు బెర్తులు ఖాళీ లేవు. ఇక ప్రతి శనివారం అందుబాటులో ఉండే భువనేశ్వర్‌-తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22879), ప్రతి ఆదివారం నడిచే భువనేశ్వర్‌-తిరుపతి సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22871)లో బెర్తులు దొరికే పరిస్థితి లేదు.

డబుల్‌ డెక్కర్‌లో ఖాళీలు

వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండే డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు ఉన్నాయి. డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరే సమయం (రాత్రి 11 గంటలకు)తోపాటు తిరుపతి చేరే సమయం (మధ్యాహ్నం 12.30 గంటలకు) కూడా అనుకూలంగా లేకపోవడం, సుమారు 14 గంటలు కూర్చుని ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికులు డబుల్‌ డెక్కర్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదు.

షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ బెర్తులు ఫుల్‌

ప్రతి గురువారం విశాఖ నుంచి బయలుదేరే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503)కు ఏప్రిల్‌ 30 వరకు బెర్తులు నిండిపోయాయి. ఈ రైలు పట్టాలెక్కిన రోజు నుంచి పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కనీసం వారానికి రెండు రోజులు అందుబాటులో ఉండేలా ఫ్రీక్వెన్సీ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నా రైల్వే అధికారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రతి ఆదివారం విశాఖలో బయలుదేరి మన్మాడ్‌ మీదుగా నడిచే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (22847)ను కొందరు షిర్డీ ప్రయాణికులు ఆశ్రయిస్తున్న నేపథ్యంలో మే 3 వరకు డిమాండ్‌ ఏర్పడింది.

విశాఖ-తిరుపతి మధ్య మరో రైలు డిమాండ్‌

విశాఖ-తిరుపతి మధ్య ప్రతిరోజు నడిచేలా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైలును శాశ్వత ప్రాతిపదికన ప్రవేశపెట్టాలని చాలాకాలంగా డిమాండ్‌ ఉంది. రైల్వే అధికారులు దానిపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన డైలీ సర్వీసుల రూపంలో కొత్త రైలు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - Mar 15 , 2026 | 12:53 AM