Share News

తాగునీటి సమస్యపై గరం గరం

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:00 AM

జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు ప్రణాళికతో వ్యవహరించడం లేదని, జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజల దాహార్తి ని ఎప్పుడు తీరుస్తారంటూ పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు.

తాగునీటి సమస్యపై గరం గరం
డీఆర్‌సీ సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు. చిత్రంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, ఎమ్మెల్యేలు బండారు, పంచకర్ల ఉన్నారు.

డీఆర్‌సీలో ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌ ఇంజనీర్ల పనితీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

తీరుమార్చుకోకపోతే పంపించేస్తానని కలెక్టర్‌ హెచ్చరిక

ఏపీఐఐసీ భూముల వివరాలు ఇవ్వలేదు: ఎమ్మెల్యే బండారు

ఈపీడీసీఎల్‌ ఇంజనీర్లు సక్రమంగా పనిచేయడం లేదు: ఎమ్మెల్యే పంచకర్ల

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర

అనకాపల్లి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు ప్రణాళికతో వ్యవహరించడం లేదని, జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజల దాహార్తి ని ఎప్పుడు తీరుస్తారంటూ పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ(డీఆర్‌సీ) సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌, ఈపీడీసీఎల్‌, ఏపీఐఐసీ అధికారుల తీరుపై సభ్యులు మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర.. స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హాలతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, జిల్లాలో పీఆర్‌ ఇంజనీర్ల నిర్వాకం కారణంగా పనులు ముందుకు సాగడం లేదన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ఇప్పటికైనా పనితీరు మెరుగు పర్చుకోవాలన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ.. పీఆర్‌ ఇంజనీర్లతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తానన్నారు. పనితీరు మార్చుకోకపోతే జిల్లా నుంచి పంపేందుకు వెనుకాడబోమన్నారు.

మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏపీఐఐసీ సేకరించిన భూముల వివరాలను ఎమ్మెల్యేలకు ఇవ్వాలని గత డీఆర్‌సీ సమావేశంలో కోరామని, కానీ ఇంతవరకు జాబితాలు అందలేదన్నారు. సమావేశానికి ఏపీఐఐసీ జోనల్‌ కమిషనర్‌ రాకుండా కిందిస్థాయి అధికారిని పంపడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ కలుగజేసుకొని.. భూముల వివరాలను ఎమ్మెల్యేలకు వెంటనే అందజేయాలని ఆదేశించారు. ఏపీఐఐసీ అధికారుల పనితీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఈపీడీసీఎల్‌ ఇంజనీర్లు సక్రమంగా పనిచేయడం లేదని, స్థానికంగా ఉండడం లేదని ఆరోపించారు. వేసవి వచ్చినప్పటికీ తాగునీటి సరఫరా సరిగా లేదని ఎమ్మెల్యే బంగారు ఆరోపించగా.. మిగిలిన ఎమ్మెల్యేలు ఆయన ఆరోపణలతో ఏకీభవించారు. దీంతో ఆర్‌డబ్లూఎస్‌ ఈఈ అనిల్‌కుమార్‌ సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయారు. జల్‌ జీవన్‌ పనులు ముందుకు సాగడం లేదని, వేసవి ప్రణాళిక ఇంకెప్పుడు అమలు చేస్తారని సభ్యులు మండిపడ్డారు. ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసినా చాలాచోట్ల నీరు రావడం లేదన్నారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లాలో ఒక్క గ్రామంలో కూడా నీటి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇటీవల నక్కపల్లిలో అర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమం విజయవంతం అయ్యిందని, ఇందుకు కారకులైన అధికారులు, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం మేరకు అధికారులు బాగా పని చేయాన్నారు. జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేలా నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్క్‌లు (ఎంఎస్‌ఎంఈలు) ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతి మండలంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమలను గుర్తించేందుకు ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్‌, మళ్ల సరేంద్ర, ప్రగడ నాగేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 01:00 AM