హాస్టల్ ఉంది.. కనిపించదు..
ABN , Publish Date - Apr 11 , 2026 | 10:52 PM
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పోస్టు మెట్రిక్ హాస్టల్ ఉంది. కానీ అది కనిపించదు. కేవలం రికార్డులోనే ఉంటుంది. అక్కడ చదువుతున్న ఇంటర్ విద్యార్థులు మూడు పూటలా టిఫిన్, భోజనం కోసం వంటశాల వద్దకు వెళతారు. వారంతా ప్రైవేటుగా ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటారు. హాస్టల్ మంజూరైన కొత్తలో ఇలా జరుగుతుందంటే సరే.. గత 24 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మరి అధికారులు, పాలకులు ఏమి చేస్తున్నారో తెలియదు. అదేదో మారుమూల ప్రాంతం కాదు.. మండల కేంద్రమైన అనంతగిరిలోనే ఈ పరిస్థితి ఉందంటే మిగతా చోట ఉన్న పోస్టు మెట్రిక్ హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అవగతం అవుతుంది. వివరాల్లోకి వెళితే..
వంట శాల వద్దే భోజనం
అద్దె రూమ్‌ల్లో తలదాచుకుంటున్న విద్యార్థులు
24 ఏళ్లుగా విద్యార్థులకు తిప్పలు
పిల్లర్లకే పరిమితమైన వసతిగృహం భవనాలు
పట్టించుకోని అధికారులు, పాలకులు
అనంతగిరి పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల దీనస్థితి
అనంతగిరి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన అనంతగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను 2002వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ బాలికలకు ఒకటి, బాలురకు మరొకటి పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. బాలికలకు భవనం ఉంది. కానీ బాలురకు ఎటువంటి హాస్టల్ లేదు. ఇక్కడ పోస్టు మెట్రిక్ హాస్టల్‌లో 300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ వీరికి గత 24 సంవత్సరాలుగా వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు చదువుకుంటూనే వసతి కోసం ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా అద్దెరూమ్‌ల్లో ఉంటూ చదువులను సాగిస్తున్నారు. వసతి లేక విద్యార్థులు మాత్రం నరకం చూస్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చదువులు సాగించక తప్పడం లేదు.
హాస్టల్ భవనాలకు రూ. రెండు కోట్లు మంజూరు
ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి 2021-22లో విద్యార్థులకు వసతిగృహం నిర్మాణానికి రూ.2 కోట్లను కేటాయించారు. అయితే ఫిల్లర్ల వరకు పనులు బాగానే జరిగాయి. తరువాత బిల్లులు అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థుల వసతిగృహం సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది విద్యాసంవత్సరంలోనై భవనం పనులు పునఃప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రూమ్‌లకు అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే మార్చిలో అనంతగిరి జూనియర్ కళాశాలను ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పరిమిళ సందర్శించారు. బాలురు వసతిగృహం పనులపై ఆరా తీశారు. నిలిచిపోయిన పనులను పరిశీలించారు. భవనం పూర్తయ్యేలోపు బాలురు వసతి సౌకర్యం కల్పించేలా ఏదైనా అద్దె ఇంటిని తీసుకోమని కళాశాల హాస్టల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. అయితే అనంతగిరిలో వసతిగృహం సరిపడే ఇళ్లు లేవని వివరించారు. వసతి సమస్యపై జిల్లా అధికారులు, పాలకులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాత్కాలిక వంటశాల శిథిలం
పోస్టుమెట్రిక్ హాస్టల్‌కు భవనాలు లేకపోవడంతో కళాశాలను ఆనుకుని 1988లోని ఐసీడీఎస్ గోదాం కోసం నిర్మించిన భవనంలోని ఓ గదిని వంటశాలగా మార్చారు. ఇక్కడ వంటలు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. అయితే ఈ గది కూడా శిథిలావస్థలో ఉంది. వర్షకాలం అయితే అది కూడా పూర్తిగా కారిపోతుంది. వండిపెట్టేందుకు ఉంచే సరుకులు సైతం తడిసిపోతున్నాయి. కనీసం నిల్చోని భోజనం చేసేందుకు కూడా వీలులేకుండా తయారైందని విద్యార్థులు వాపోతున్నారు. కళాశాల ఏర్పాటైనప్పటికీ నుంచి విద్యార్థులకు భోజనం వండిపెట్టేందుకు మాత్రమే ఆ శిథిలా భవనాన్ని ఉపయోగిస్తున్నారు.