కోడిపుంజులకు భలే గిరాకీ
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:12 AM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపుంజులకు గిరాకీ పెరిగింది. మంగళవారం లోతుగెడ్డ జంక్షన్ వారపు సంతలో ఒక్కొక్క కోడిపుంజు రూ.10 వేలకు పైగా ధర పలికింది.
వారపు సంతలో ఒక్కొక్కటి రూ.10 వేలకుపైగా పలికిన ధర
చింతపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపుంజులకు గిరాకీ పెరిగింది. మంగళవారం లోతుగెడ్డ జంక్షన్ వారపు సంతలో ఒక్కొక్క కోడిపుంజు రూ.10 వేలకు పైగా ధర పలికింది. గత కొంత కాలంగా నాటుకోళ్లకు తెగుళ్లు వ్యాప్తి చెంది అధిక సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దీంతో నాటుకోళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో కిలో బరువు కలిగిన నాటుకోడి రూ.800 నుంచి రూ.వెయ్యి ధరకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి నేపథ్యంతో నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కిలో, రెండు కిలోలు కలిగిన పెట్టలు రూ.1500 నుంచి రూ.2000 ధరకు విక్రయించారు. కోడిపుంజు రంగు ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల ధరకు విక్రయించారు. సంక్రాంతి సందర్భంగా గిరిజన గ్రామాల్లో కోడిపందేలు జరుగుతుంటాయి. దీంతో జూదగాళ్లు జాతి కోడిపుంజులను పోటీపడి కొనుగోలు చేశారు. కాగా లోతుగెడ్డ జంక్షన్ వారపు సంతకు భారీ సంఖ్యలో కోడిపుంజులు విక్రయానికి వచ్చాయి.