Share News

మొట్టలగుమ్మిలో కలకలం

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:47 PM

మండలంలోని మారుమూల బొంగరం పంచాయతీ పరిధిలో గల మొట్టలగుమ్మి గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా ఒకేరోజు ఎనిమిది పశువులు మృతి చెందడంతో కలకలం రేగింది.

మొట్టలగుమ్మిలో కలకలం
మృతి చెందిన ఆవు వద్ద విచారవదనంతో గిరిజన రైతులు .

ఒకేరోజు అనుమానాస్పదంగా ఎనిమిది పశువులు మృతి

పెదబయలు, ఏప్రిల్‌ 7 (ఆంఽధ్రజ్యోతి): మండలంలోని మారుమూల బొంగరం పంచాయతీ పరిధిలో గల మొట్టలగుమ్మి గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా ఒకేరోజు ఎనిమిది పశువులు మృతి చెందడంతో కలకలం రేగింది. దీంతో బాధిత రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మొట్టలగుమ్మి గ్రామానికి చెందిన బురారి లక్ష్మయ్య, తల్లే లక్ష్మీపతి, తల్లే చిన్నయ్య, కె.బుజ్జిబాబు, టి.చిన్నారావుతో పాటు మరికొందరు రైతుల పశువులను ఎప్పటిలాగానే మంగళవారం ఉదయం కొండ ప్రాంతానికి మేతకు వదిలారు. సాయంత్రం లక్ష్మయ్యకు చెందిన ఒక ఆవు సాయంత్రం ఇంటికి చేరగా, దానిని పశువుల శాలలో కడదామనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుర్రుమంటూ పెద్ద శబ్ధం చేస్తూ కళ్లు తెల్లగా మారిపోయి కంటి నుంచి నీరు కారుతూ గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందింది. అలాగే చిన్నారావుకు చెందిన రెండు పశువులు ఇంటికి వచ్చి మృతి చెందాయి. దీంతో ఏం జరిగిందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందారు. మిగతా రైతులు కొండ ప్రాంతానికి వెళ్లి చూడగా ఐదు పశువులు విగతజీవులుగా పడి ఉన్నాయి. మరికొన్ని పశువుల జాడ ఇంకా తెలియలేదు. అడవిలో విషపూరితమైన మొక్కలు, లేదా తినరాని మేత తినడం వల్ల, లేక ఏదైనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మృతి చెంది ఉంటాయా అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పశు సంవర్థక శాఖ అధికారులకు తెలియజేశారు. దీనిపై పశు సంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌.కిశోర్‌ వివరణ కోరగా, తమకు గ్రామస్థులు మంగళవారం సాయంత్రం ఈ విషయం చెప్పారని, అయితే మండల కేంద్రానికి ఆ గ్రామం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వైద్యులను పంపడానికి అవకాశం లేకపోయిందన్నారు. బుధవారం ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 11:47 PM