Share News

ప్రతీ బిల్లుకూ ఓ లెక్కుంది!

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:56 AM

జిల్లాలోని ఖజానా శాఖ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా ఉద్యోగులు, సిబ్బంది చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు వినవస్తున్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు.

ప్రతీ బిల్లుకూ ఓ లెక్కుంది!
నర్సీపట్నం ఉప ఖజానా కార్యాలయం

- ఖజానా కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరిందని ఆరోపణలు

- ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరగాల్సి ఉన్నా ఆగని పర్సంటేజీల దందా

- తాజాగా నర్సీపట్నం సబ్‌ ట్రెజరీ అకౌంటెంట్‌ ఏసీబీకి చిక్కడంతో బహిర్గతం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ఖజానా శాఖ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా ఉద్యోగులు, సిబ్బంది చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు వినవస్తున్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు.

జిల్లా కేంద్రం అనకాపల్లిలో జిల్లా ఖజానా కార్యాలయంతో పాటు మరో ఏడు ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో ప్రతి బిల్లుకు కొంత ‘పర్సంటేజీ’ ఇస్తేనే పని సులువుగా జరుగుతుందన్న విమర్శలున్నాయి. తాజాగా నర్సీపట్నం ఉప ఖజానా కార్యాలయంలో రిటైర్డ్‌ తహశీల్దార్‌ తనకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు సమర్పించడంతో దానిని మంజూరు చేయడానికి సీనియర్‌ అకౌంటెంట్‌ రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేసి రూ.30 వేలు తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది ఆ శాఖలో పెచ్చుమీరిన అవినీతిని తెలియజేస్తోంది.

అంతా ఆన్‌లైన్‌ అయినా లంచం ఇవ్వాల్సిందే..

వాస్తవానికి సెంట్రలైజ్డ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సీఎఫ్‌ఎంఎస్‌) విధానంలో అన్ని ప్రభుత్వ శాఖల వివిధ రకాల బిల్లులన్నీ ఆన్‌లైన్‌లోనే సమర్పించడం, పరిశీలించడం, పాస్‌ చేయడం జరుగుతుంది. దీంతో ఉద్యోగుల జోక్యం తగ్గి అవినీతికి ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 45కిపైగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాల ఉద్యోగుల జీతభత్యాలు, సరండర్‌ లీవ్‌లు, ఈఎల్‌లు, జీపీఎఫ్‌, పీఎఫ్‌, జీఐఎస్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులతో పాటు వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు ఖజానా కార్యాలయాల ద్వారానే చెల్లింపులు జరుగుతుంటాయి. ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయినా బిల్లు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసిన తరువాత సంబంధిత ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని కలవకపోతే కొర్రీలు వేస్తారని, చిన్నచిన్న కారణాలతో బిల్లులను వెనక్కి పంపుతున్నారని పలువురు వాపోతున్నారు. పాయకరావుపేట ఉప ఖజానా కార్యాలయ పరిధిలో ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన ఒక ఉద్యోగి ఆరు నెలలుగా బిల్లులు పాస్‌ చేయండి మహాప్రభో అంటూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, కాసుల బేరం కుదరక పని జరగడం లేదని తెలిసింది. దీంతో ఆయన ఉద్యోగ సంఘ నాయకులను ఆశ్రయించి తన గోడు వెల్లబుచ్చుకున్నారు. పీఎఫ్‌ సెటిల్‌మెంట్‌ ఫైళ్లు, కార్యాలయ నిర్వహణ ఖర్చుల బిల్లులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని ముందుగా సంప్రతించి మాట్లాడుకుంటే ప్రక్రియ సాఫీగా జరుగుతుందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఎవరైనా బేరం కుదుర్చుకోకుండా బిల్లులు పెట్టాం కదా, వస్తాయిలే అనుకుంటే నెలల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిందేనని అంటున్నారు.

పర్సంటేజీ ఇస్తేనే..

జిల్లా ఖజానా కార్యాలయం పరిధిలోని ఉప ఖజానా కార్యాలయాల్లో ఒక ఎస్‌టీవో, ఏటీఓ, ఇద్దరు సీనియర్‌ అకౌంటెంట్లు, మరో ఇద్దరు జూనియర్‌ అకౌంటెంట్లు ఉంటారు. కార్యాలయాల నుంచి వచ్చే ఆన్‌లైన్‌ బిల్లులు వీరు పరిశీలించిన తరువాతే పాస్‌ అవుతాయి. ఉప ఖజానా కార్యాలయంలో ఒక అకౌంటెంట్‌ నాలుగు నుంచి ఆరు ప్రభుత్వ శాఖల బిల్లులు పరిశీలించాల్సి ఉంటుంది. బిల్లుల పరిశీలన అనంతరం ఏటీఓ, డీటీఓలు ఓకే చెబితేనే బిల్లులు పాస్‌ అవుతాయి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక చెల్లింపులు జరుగుతాయి. ఉప ఖజానా కార్యాలయాలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల పీఎఫ్‌ సెటిల్‌మెంట్లు, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, వివిధ ప్రభుత్వ చెల్లింపులకు సంబంఽధించిన బిల్లులే వస్తుంటాయి. వీటిలో ప్రతి బిల్లుకూ ఎంతో కొంత చెల్లిస్తేనే అది మంజూరు అవుతుంది. రూ.లక్షకు 2 నుంచి 5 శాతం వరకు పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన రూ.లక్ష బిల్లు ఉప ఖజానా కార్యాలయంలో పాస్‌ అయితే, సంబంధిత ఉద్యోగి రూ.2 వేలు లంచం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తం అయితే కాస్త ఎక్కువ పర్సంటేజీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరైన వెంటనే పర్సంటేజీ పేరుతో వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఉప ఖజానా కార్యాలయాల్లో అయితే బిల్లుల కోసం వచ్చే వివిధ శాఖల నుంచి ప్లైలీఫ్‌ రికార్డులను (ప్రతి నెలా ఆ శాఖ ఉద్యోగులకు చెల్లించే జీతాల బిల్లుల వివరాల నమోదు పట్టిక) కూడా కొనిపించి వారితోనే రాయిస్తున్నారని తెలిసింది. ఉప ఖజానా కార్యాలయాలకు, సంబంధిత శాఖలకు మధ్యవర్తులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్లు వ్యవహరిస్తుంటారని సమాచారం. వీరి ద్వారానే బేరం కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది. ఉప ఖజానా కార్యాలయాల్లో బిల్లుల విషయంలో వసూళ్లు జరుగుతున్నట్టు జిల్లా ఖజానా అధికారులకు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిగువ స్థాయి కార్యాలయాల్లో వసూలైన పర్సంటేజీల్లో కొంతమొత్తం పైస్థాయికి కూడా చేరుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారులు మాత్రం బిల్లులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్‌ అవుతున్నందున అక్రమాలకు అవకాశం లేదని చెబుతున్నారు. జిల్లాలోని అన్ని ఉప ఖజానా కార్యాలయాల్లో బిల్లుల ప్రాసెసింగ్‌ విధానంపై సమగ్రంగా విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బిల్లులు తిరస్కరించడానికి కారణాలు, మళ్లీ ఆమోదించిన విధానం, బిల్లుల ప్రాసెసింగ్‌కు పట్టిన సమయం, తదితర అంశాలను పరిశీలిస్తే, ఉప ఖజానా కార్యాలయాల్లో అవినీతి బాగోతం బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:56 AM