Share News

షెడ్లున్నా.. రోడ్డుపైౖనే!

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:27 AM

మండల కేంద్రంలో రూ.25 లక్షల నాబార్డు, పంచాయతీ నిధులతో నిర్మించిన సంత షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

షెడ్లున్నా.. రోడ్డుపైౖనే!
రహదారిపై ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలు

నిరుపయోగంగా సంత సముదాయం

రోడ్డుపై దుకాణాలతో ట్రాఫిక్‌ సమస్యలు

పట్టించుకోని అధికారులు

చింతపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో రూ.25 లక్షల నాబార్డు, పంచాయతీ నిధులతో నిర్మించిన సంత షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్మించిన షెడ్లను వ్యాపారులు వినియోగించడం లేదు. వర్తకులు సంతలోని దుకాణాలను రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. సంబంధితశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ప్రతి బుధవారం చింతపల్లి వారపు సంత జరుగుతుంది. మండలంలో చింతపల్లి సంత పెద్దది కావడంతో వందల సంఖ్యలో వర్తకులు, వేల సంఖ్యలో వినియోగదారులు వస్తారు. సంత రోజు హనుమాన్‌ జంక్షన్‌ నుంచి డిగ్రీ కళాశాల వరకు రద్దీగా వుంటుంది. గతంలో సంత రోజు పాత బస్టాండ్‌ నుంచి డిగ్రీ కళాశాల సంతబయలు వరకు వర్తకులు రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేసేవారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోవడంతో నాబార్డు రూ.20లక్షలు, పంచాయతీ రూ.ఐదు లక్షల నిధులు వెచ్చించి సంతబయలు వద్ద 45 దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. ఈ దుకాణాలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. ఈ దుకాణాలను కూరగాయల వర్తకులకు కేటాయించారు. సంతబయలు ఖాళీ స్థలాన్ని ఫ్యాన్సీ, దుస్తులు, ఇతర దుకాణాల వ్యాపారులకు అప్పగించారు. సుమారు ఆరు నెలల వరకు సంత షెడ్లలోనే వర్తకులు దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో రహదారికి ఇరువైలా దుకాణాలు ఉండేవికావు. ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా తగ్గింది. అయితే కొంత కాలంగా సంత షెడ్లలో ఉన్న దుకాణాలు ఒక్కొక్కటి రహదారి పక్కన ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం సంత షెడ్లు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. దుకాణాలన్నీ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయడంతో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సంత షెడ్లు వృఽథాగా పడివున్నాయి. ప్రస్తుతం మందుబాబులు, యాచకులు ఈ షెడ్లను వినియోగిస్తున్నారు. కాగా రహదారికి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్‌, పంచాయతీ అధికారులు స్పందించి రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను సంత షెడ్లకు తరలించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:27 AM