గడువు 3 రోజులే సర్
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:21 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువు ముగియడానికి మరో మూడు రోజులు (14వ తేదీ రాత్రి 12 గంటల వరకు) సమయం ఉంది.
జిల్లాలో 99.67 శాతం మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేత
తిరిగి వచ్చినవి 74.81 శాతం
పంపిణీ చేసిన ఫారాలను వెనక్కి తీసుకునేందుకు చొరవ చూపని బీఎల్‌వోలు
సచివాలయాల్లో ఇవ్వాలని సమాధానం
ఎన్యుమరేషన్ ఫారాల అందజేతలో అపార్టుమెంట్ వాసుల నుంచి మిశ్రమ స్పందన
100 శాతం లక్ష్యం కోసం జిల్లా యంత్రాంగం పరుగులు
వలస వెళ్లిన/ఇళ్లు మారిన 3.15 లక్షల మంది ఓటర్లపై సందిగ్ధం
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువు ముగియడానికి మరో మూడు రోజులు (14వ తేదీ రాత్రి 12 గంటల వరకు) సమయం ఉంది. బూత్ లెవెల్ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు శత శాతం లక్ష్య సాధనకు పరుగులు పెడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పర్యవేక్షకులుగా సీనియర్ అధికారులను, వారి కింద మండల స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో శనివారం సాయంత్రం వరకు 20,23,009 మంది ఓటర్లకుగాను 20,22,337 మంది (99.67 శాతం)కి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. వారిలో ఇప్పటివరకూ 15,86,941 మంది (78.44 శాతం) ఫారాలు వెనక్కి ఇవ్వగా డిజిటలైజేషన్ పూర్తిచేశారు.
35 వేల ఓట్ల తొలగింపు
జిల్లాలో సుమారు 20 వేల మంది ఓటర్లు చనిపోయారు. మరో 15 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఆ 35 వేల ఓట్లను జాబితా నుంచి తొలగించనున్నారు. ఇక వలస వెళ్లినవారు/బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు/నగరంలో ఒకచోట నుంచి మరోచోటకు ఇళ్లు మారినవారు సుమారు 3.15 లక్షల మంది ఉన్నారు. వారిలో కొందరికి బీఎల్‌వోలు ఫోన్ చేసి ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవాలని, లేదా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని అన్ని వివరాలు పూరించి గతంలో నివాసం ఉన్న ప్రాంతంలోని సచివాలయానికి అందజేయాలని కోరుతున్నారు. ఫోన్ నంబర్లు లేని, ఫోన్ చేసినా స్పందించని వారి విషయంలో ఏం చేయాలో అర్థం కాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కాగా నగరంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి అందజేతలో అపార్టుమెంటు వాసుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొన్నిచోట్ల బీఎల్‌వోలను భద్రతా సిబ్బంది లోపలకు అనుమతించలేదు. కొన్నిచోట్ల అసోసియేషన్ ప్రతినిధుల నుంచి తగినంత సహకారం లేదు. తూర్పు నావికాదళం క్వార్టర్లలో ఫారాల పంపిణీకి రెండు, మూడు రోజుల క్రితం అనుమతి వచ్చిందని చెబుతున్నారు.
ఇక ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకున్న వారిలో చాలామంది వాటిని తిరిగి బీఎల్‌వోలకు అందజేయడం లేదు. నిబంధనల మేరకు బీఎల్‌వోలు...తమకు కేటాయించిన ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేయడంతో పాటు తిరిగి తీసుకోవాలి. పని ఒత్తిడి అంటూ సాకు చెబుతూ ఓటర్లకు ఫోన్ చూసి ఫారాలు సచివాలయాల్లో అప్పగించాలని సూచిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇంతవరకూ ఫారాలు అందజేయకుండానే ఇచ్చినట్టు కాకిలెక్కలు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ రాత్రి 12 గంటలోపు శతశాతం ఫారాలు డిజటైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందా?...అన్నదే ప్రశ్న.
- 2024లో ఓటు వేసిన/జాబితాలో పేరు ఉండి ఇప్పటివరకూ ఫారాలు అందనివారు తక్షణమే తమ పరిధిలోని సచివాలయానికి వెళ్లి బీఎల్‌వోను సంప్రతించాలి. నగరంలో మరో ప్రాంతానికి మారిన ఓటర్లు కూడా గతంలో ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ అందజేసిన ఫారాలు తీసుకుని వెంటనే పూరించి అందజేయాలి.
- ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు 2002లో ఓటు లేకపోయినా ముందుగా ఈనెల 14వ తేదీలోగా ఫారం పూరించి బీఎల్‌వోకు అందజేయాలి. ఈనెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురితమైనప్పుడు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని సమర్పించవచ్చు.
- ప్రస్తుతం జాబితాలో ఓటు లేని వారు ఈనెల 21వ తేదీ తరువాత ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించే సమయంలో కొత్తగా ఫారం-6 పూరించి అందజేయాలి.
జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు: ఏడు
పోలింగ్ బూత్‌లు 1,980
ఇప్పటివరకూ అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలు: 20,22,337 (99.67 శాతం)
డిజిటలైజేషన్ అయిన ఫారాలు 15,86,941 (78.44 శాతం)
చనిపోయిన/డూప్లికేట్ ఓట్లు 35,000
వలస/బదిలీ/నగరంలోనే ఇళ్లు మారినవారు 3,15,000
--------------------- ------------------------
నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్
అసెంబ్లీ మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ శాతం
భీమిలి 3,67,486 3,67,486 2,93,098 79.76
విశాఖ తూర్పు 2,92,227 2,92,209 2,25,445 77.15
విశాఖ దక్షిణ 2,17,795 2,17,785 1,62,928 74.81
విశాఖ ఉత్తర 2,84,341 2,84,341 2,17,785 76.59
పశ్చిమ 2,13,890 2,13,245 1,69,226 79.12
గాజువాక 3,34,788 3,34,759 2,57,067 76.79
పెందుర్తి 3,12,502 3,12,502 2,61,392 83.64
మొత్తం 20,23,009 20,22,337 15,86,941 78.44