Share News

ఓటర్లు 17,82,800 మంది

ABN , Publish Date - Jul 26 , 2026 | 01:21 AM

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)తో జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనున్నది.

ఓటర్లు 17,82,800 మంది

2,40,209 మంది పేర్లు తొలగింపు

అధికారికంగా వెల్లడి

గాజువాక, తూర్పు, ఉత్తరం

నియోజకవర్గాల్లో అత్యధికం

31వ తేదీన ముసాయిదా జాబితా విడుదల

అభ్యంతరాల వెల్లడికి అవకాశం

అక్టోబరు 3న తుది జాబితా విడుదల

విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)తో జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గనున్నది. ప్రాథమిక అంచనా ప్రకారం గతంలో 20,23,009 మంది ఓటర్లు ఉండగా, 2,40,209 మంది పేర్లు తొలగించనున్నారు. దీంతో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17,82,800 మంది ఓటర్లు ఉండనున్నారు. దీనికి సంబంధించి ఈనెల 31వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో 56,468 ఓట్లు తొలగించనున్నారు. అలాగే ఉత్తర నియోజకవర్గంలో 38,473, తూర్పులో 34,257, భీమిలిలో 31,536, పశ్చిమలో 30,556, పెందుర్తిలో 26,008, ‘సౌత్‌’లో 22,911 ఓట్లు తొలగించనున్నారు. గత నెల 15వ తేదీన ప్రారంభమైన సర్‌ ప్రక్రియ శుక్రవారం (24వ తేదీ) రాత్రి 12 గంటలతో ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం అధికారికంగా ప్రకటన విడుదల అయ్యింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత నెల ఒకటో తేదీ నాటికి 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ద్వారా ప్రతి ఓటరు నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు యత్నించారు. మొత్తం 20,23,009 మందిలో 4,99,404 (24.69 శాతం) మంది 2002లో ఓటు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. మరో 12,55,828 మంది (62.08 శాతం) తమకు 2002లో ఓటు లేకపోయినా కుటుంబంలో తండ్రి/తల్లి, తాత, ఇతర బంధువుల వివరాలు నమోదుచేసి ఫారాలు అందజేశారు. 27,558 (1.36 శాతం) మంది ఎన్యుమరేషన్‌ ఫారాల్లో 2002లో ఓటు వివరాలను నమోదు చేయలేదు. అన్‌ కలెక్టబుల్‌ ఫారాలు (చనిపోయినవారు, డూప్లికేట్లు, ఆచూకీ లేనివారు, వలసవెళ్లిన ఓటర్లు) 2,40,209 ఉన్నాయి. దీంతో ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వని 2,40,209 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో భీమిలిలో మాత్రమే మూడు లక్షలు దాటి ఓటర్లు ఉంటారు. గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో ఓటర్లు మూడు లక్షలలోపు ఉండనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా చూసిన ఎవరైనా వచ్చి అభ్యంతరం వ్యక్తం చేస్తే తిరిగి చేర్చుకునేందుకు ఫారం-6 సమర్పించే అవకాశం ఉంది. కాగా ఈనెల 31వ విడుదల చేయనున్న ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఆగస్టు 30వ తేదీలోగా సమర్పించవచ్చు. దీని ప్రకారం ఈనెల 31వ తేదీ నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు ఆయా ఓటర్లకు నోటీసులు జారీచేస్తారు. తుది ఓటర్ల జాబితా అక్టోబరు మూడో తేదీన ప్రచురించనున్నారు.

జిల్లాలో ప్రస్తుత ఓటర్లు, తొలగించనున్న ఓటర్లు, మిగిలిన ఓటర్ల వివరాలు

నియోజకవర్గం జూన్‌ ఒకటో తేదీన తొలగించనున్న మిగిలిన

ఉన్న ఓటర్లు ఓట్లు ఓటర్లు

1. భీమిలి 3,67,486 31,536 3,35,950

2. విశాఖ తూర్పు 2,92,227 34,257 2,57,970

3. విశాఖ దక్షిణ 2,17,795 22,911 1,94,884

4. విశాఖ ఉత్తరం 2,84,341 38,473 2,45,868

5. విశాఖ పశ్చిమ 2,13,890 30,556 1,83,334

6. గాజువాక 3,34,768 56,468 2,78,300

7. పెందుర్తి 3,12,502 26,008 2,86,494

మొత్తం 20,23,009 2,40,209 17,82,800

Updated Date - Jul 26 , 2026 | 01:21 AM