పెళ్లి వేడుకలో చోరీ
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:32 AM
వివాహ వేడుకలో ఐదు లక్షల రూపాయల నగదు, పావుతులం బంగారం వున్న పెళ్లి కుమార్తె సోదరి హ్యాండ్ బ్యాగును ఓ వ్యక్తి లాక్కొని ఒక్క ఉదుటన ఉడాయించాడు. దీంతో అక్కడున్న వారు కేకలు వేస్తూ అతని వెంట పడినప్పటికీ చీకటిగా వుండడంతో ఎటు వెళ్లాడో కనిపించలేదు. అనంతరం 112 నంబరుకు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి మూడు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను శుక్రవారం మధ్యాహ్నం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
రూ.5 లక్షల నగదు, పావు తులం బంగారం ఉన్న బ్యాగుతో ఉడాయింపు
112కు ఫోన్ చేసిన బాధితులు
మూడు గంటల్లోనే సొత్తుతో సహా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
నాతవరం/ నర్సీపట్నం అర్బన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వివాహ వేడుకలో ఐదు లక్షల రూపాయల నగదు, పావుతులం బంగారం వున్న పెళ్లి కుమార్తె సోదరి హ్యాండ్ బ్యాగును ఓ వ్యక్తి లాక్కొని ఒక్క ఉదుటన ఉడాయించాడు. దీంతో అక్కడున్న వారు కేకలు వేస్తూ అతని వెంట పడినప్పటికీ చీకటిగా వుండడంతో ఎటు వెళ్లాడో కనిపించలేదు. అనంతరం 112 నంబరుకు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి మూడు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలను శుక్రవారం మధ్యాహ్నం రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
నాతవరం మండలం శృంగవరం గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ ఇంటిలో వివాహ వేడుక జరిగింది. వధువు సొదరి సుర్ల రజని వివాహ ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల నగదుతోపాటు పావుతులం బంగారం, మొబైల్ ఫోన్‌ను హ్యాండ్ బ్యాగులో పెట్టుకొని పెళ్లి మండపం వద్ద కూర్చున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పైల చిట్టిబాబు పెళ్లి మండపంలోకి వచ్చి, రజని వద్ద ఉన్న బ్యాగును లాక్కొని పరుగులు తీశాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ కొద్ది దూరం వెంబడించింది. రాత్రి కావడంతో అతను చీకటిలో అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేశారు. నాతవరం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ మహేశ్, హోంగార్డు సంజీవ్ అప్రమత్తమై, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్‌ఐ తారకేశ్వరరావు పోలీసు సిబ్బందితో బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించారు. అప్పటికే తెల్లవారడంతో చోరీకి పాల్పడిన చిట్టిబాబు దొరికిపోయాడు. అతని వద్ద బ్యాగు లేకపోవడంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. సమీపంలోని గడ్డివాములో దాచినట్టు చెప్పడంతో అక్కడకు వెళ్లి బ్యాగుతోపాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చిట్టిబాబు పాయకరావుపేట మండలంలోని డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. మద్యానికి బానిసై చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వేగంగా స్పందించి కేసును ఛేదించిన ఎస్‌ఐ తారకేశ్వరరావు, సీఐ రేవతమ్మ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డులు అందజేశారు.