ఉపమాక వెంకన్న ఆలయంలో చోరీ!
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:08 AM
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
రెండు హుండీలను కట్టర్లతో కట్ చేసి నగదు, నగలు ఎత్తుకుపోయిన దొంగలు
ఆలయం వెనుక ఉన్న జీడి తోటలో ఆభరణాల మూట లభ్యం
రూ.5 లక్షలు అపహరణకు గురై ఉంటుందని అంచనా
కొండపై గల ఆలయంలో కూడా చోరీకి విఫలయత్నం
నక్కపల్లి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. కొండ కిందనున్న ప్రధాన ఆలయంలో గల రెండు ప్రధాన హుండీలను ముసుగులు ధరించి ఉన్న ఇద్దరు విద్యుత్ కట్టర్లతో కట్ చేసి అందులో ఉన్న నగలు, నగదు పట్టుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి. దొంగలు ఆలయం వెనుక ఉన్న జీడి తోటల్లో నుంచి చెట్ల ఆధారంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1.15 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ప్రధాన ఆస్థాన మండపంలో గల హుండీ, గోదాదేవి అమ్మవారి మూలవిరాట్ సన్నిధి ప్రాంగణంలో ఉన్న మరో హుండీని పగులగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు పట్టుకుపోయారు. ఆ సమయంలో దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఎం.చంద్రరావు, లక్ష్మణ్ అనే ఇద్దరు ఆలయం బయట విధుల్లోనే ఉన్నారు. ఉపమాక ఆలయం టీటీడీకి అనుబంధంగా ఉంది. దీంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బందే ఉంటున్నారు. టీటీడీ విజిలెన్స్ నిబంధనల ప్రకారం రాత్రి సమయంలో ప్రతి గంటకు ఒకసారి ఆలయ పరిస్థితిపై మెసేజ్ ఉన్నతాధికారులకు పంపాలి. అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో దొంగలు ఆలయంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడగా, ఆ విషయం గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది ఒంటి గంటకు పొజిషన్ పీస్ ఫుల్ అంటూ మెసేజ్ పంపారు. తెల్లవారుజామున 4.30 గంటలకు కూడా ఇదే మెసేజ్ పంపినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. ఉదయం ఐదు గంటలకు ఈ ఇద్దరు ఆలయం లోపలకు వెళ్లగా దొంగతనం జరిగినట్టు గుర్తించి ఆలయ ఇన్‌స్పెక్టర్, అర్చకులకు సమాచారం ఇచ్చారు. కనీస అవగాహన లేకుండా హుండీల వద్ద దొంగలు వదిలేసిన చిల్లర నాణాలను ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది తిరిగి హుండీలను టచ్ చేసి అందులో వేసేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు కొండపై ఉన్న ఆలయంలో కూడా చోరీకి విఫలయత్నం చేసినట్టు పోలీసులు, ఆలయ అధికారులు గుర్తించారు.
జీడి తోటలో నగలు వదిలేసిన దొంగలు
ఉపమాక ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు హుండీల్లో లభించిన కొన్ని బంగారు వస్తువులు, వెండి ఆభరణాలను ఆలయానికి వెనుక ఉన్న జీడి తోటలో (ఎన్.నర్సాపురం వెళ్లే మార్గం)లో వదిలేశారు. పోలీస్ జాగిలాలు చోరీకి గురైన హుండీలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి నేరుగా ఆలయం వెనుక ఉన్న తోటలోకి వెళ్లి, ఆభరణాల మూట ఉన్న ప్రాంతాన్ని పసిగట్టి అక్కడ ఆగిపోయాయి. దీంతో పోలీసులు అక్కడ ఉన్న మూటను పరిశీలించగా అందులో పలు వెండి ఆభరణాలు, కొన్ని బంగారు వస్తువులు ఉన్నాయి. అందులో సుమారు రెండున్నర కిలోల వెండి ఆభరణాలు, 56 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు ఆలయ అధికారులు, పోలీసులు గుర్తించారు. భక్తులు కానుకల రూపంలో వేసిన వెండి, చిన్న చిన్న బంగారు వస్తువులను హుండీలు తెరిచినప్పుడల్లా మళ్లీ మూటగట్టి వాటిల్లోనే వేసేస్తుంటారు. వాటిని కరిగించేందుకు టీటీడీ నుంచి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఇలా చేస్తూనే ఉంటారు. అయితే దొంగలు ఆ ఆభరణాల మూటను వదిలేశారు.
భారీగా నగదు అపహరణ
ఆభరణాల మూట దొరికినప్పటికీ భక్తులు సమర్పించిన నగదు భారీగా పోయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఎందుకంటే మూడు నెలల నుంచి హుండీలను తెరవలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న శ్రీవారి కల్యాణం ముగిసిన తరువాత మార్చి ఐదో తేదీన హుండీలు లెక్కించారు. ఆ తరువాత మార్చి నెలాఖరు వరకూ ఉత్సవాలు సందర్భంగా జాతర జరిగింది. అనేక ప్రాంతాల నుంచి రికార్డు స్థాయిలో భక్తులు ఆలయానికి వచ్చారు. ఆ తరువాత ఉగాది, శ్రీరామ నవమి జరిగాయి. ఇంకా ప్రతి శనివారం ఆలయానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తుంటారు. స్వామిని దర్శించుకుని కానుకలు హుండీల్లోనే సమర్పించారు. ఈ లెక్కన హుండీల్లో రూ.5 లక్షలుపైనే ఉంటుందని భావిస్తున్నారు. బంగారం, వెండి ఆభరణాలు భద్రంగానే ఉన్నాయని, సుమారు రూ.2 లక్షలు నగదు పోయి ఉండవచ్చునని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆలయ ఇన్‌స్పెక్టర్ కూర్మేశ్వరరావు పేర్కొన్నారు.
హోం మంత్రి అనిత ఆరా
ఉపమాక ఆలయంలో చోరీపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఆలయ మాజీ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, దొంగలను పట్టుకోవాలని ప్రత్యేక బృందాలను నియమించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళీని ఆమె ఆదేశించారు. చోరీ జరిగిన ఆలయాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు మురళీ, ఎల్.రామకృష్ణ, ఎస్‌ఐలు సన్నిబాబు, సాహిబా అంజుమా, క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు పరిశీలించారు. ఆలయం పరిసరాలు, తోటలను సునిశితంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పుటేజీలను కూడా పరిశీలించారు. అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీనివారావు, సీఐ మురళీ చెప్పారు.