పాడేరు కనకదుర్గాదేవి ఆలయంలో చోరీ
ABN , Publish Date - May 02 , 2026 | 11:18 PM
జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు వెండి, బంగారు తదితర ఆభరణాలను అపహరించారని ఆలయ కమిటీ ధర్మకర్త రొబ్బి రాము తెలిపారు.
రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరణ
పాడేరురూరల్, మే 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు వెండి, బంగారు తదితర ఆభరణాలను అపహరించారని ఆలయ కమిటీ ధర్మకర్త రొబ్బి రాము తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు నండూరి వెంకటప్రసాద్ శర్మ శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఆలయానికి తాళాలు వేసుకొని వెళ్లారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఆలయానికి వచ్చి తలుపులు తెరవాలని చూసేసరికి ఆలయ పక్క (ద్వారం) గేటు తాళం విరగొట్టి ఉండడంతో ఆలయంలో చోరీ జరిగినట్టు అర్చకుడు గుర్తించారు. వెంటనే ఆయన ఆలయ కమిటీ ధర్మకర్త రొబ్బి రాము, కమిటీ ప్రతినిధులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ డి.దీనబందు, ఎస్‌ఐ కె.పాపినాయుడు ఆలయానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే అపహరణకు పాల్పడిన దుండగులను పట్టుకుంటామని సీఐ దీనబందు తెలిపారు. ఆలయ ధర్మకర్త రాము మాట్లాడుతూ ఈ చోరీలో తులం అమ్మవారి మంగళసూత్రాలు, కిలో వెండి పాదాలు, 750 గ్రాముల వెండి కిరీటంతోపాటు మరికొన్ని ఆలయ వస్తువులు అపహరణకు గురయ్యాయని తెలిపారు. అపహరణకు గురైన ఆభరణాల విలువ రూ.7 లక్షలు మేర ఉంటాయన్నారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ముందుగా తొలగించి అపహరణకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు నాగు, వెంకట్, అప్పారావు, అప్పాలు, ప్రసాద్, మత్స్యరాజు పాల్గొన్నారు.