Share News

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:08 PM

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపన ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
పోలీస్‌ శాఖ చేపట్టిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ నిషాంతి

కలెక్టర్‌ టి.నిషాంతి

నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభం

పాడేరురూరల్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపన ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కలెక్టర్‌ టి.నిషాంతి పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తూ గంజాయి, డ్రగ్స్‌ వంటి నిషేధిత మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువత వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థమని, దానిని కలిగి ఉండడం, వినియోగించడం, రవాణా చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. వాటి వినియోగం వల్ల యువత ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, కుటుంబాలు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. అనంతరం గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్‌ కూడలిలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్‌ అధికారి పంకజ్‌కుమార్‌ మీనా, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ వై.శృతి, ఎన్‌డీపీఎస్‌ సీఐ పి.పైడిపనాయుడు, అరకు సీఐ ఎల్‌.హిమగిరి, ఈగల్‌ టీమ్‌ సీఐ దేముళ్ళు, ఈగల్‌ బృందం సభ్యులు, ఇతర పోలీస్‌ అధికారులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు, కళాశాలల విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:08 PM