అన్నను కడతేర్చిన తమ్ముడు
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:30 PM
మండలంలోని వంచుల చెరపల్లి గ్రామంలో మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేశాడు.
మద్యం మత్తులో గొడవ పడిన అన్నదమ్ములు
అన్న తలపై కర్రతో బాదిన తమ్ముడు
గూడెంకొత్తవీధి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వంచుల చెరపల్లి గ్రామంలో మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేశాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వంచుల చెరపల్లి గ్రామంలో పొత్తూరు చంటిబాబు(40), పొత్తూరు రాజేంద్రప్రసాద్ అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరికి వివాహం జరిగినప్పటికీ భార్యలు కొన్నేళ్ల క్రితం భర్తలను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయారు. అన్నదమ్ములు ప్రతి రోజూ మద్యం సేవించి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవ పడుతుంటారు. శనివారం మధ్యాహ్నం అన్నయ్య పొత్తూరు చంటిబాబు, తమ్ముడు రాజేంద్రప్రసాద్ ఇద్దరు మద్యం సేవించి ఇంటికి వచ్చారు. ఇద్దరి మధ్య తలెత్తిన స్వల్ప వివాదంలో మద్యం మత్తులో ఉన్న తమ్ముడు రాజేంద్రప్రసాద్ కర్రతో అన్నయ్య చంటిబాబు తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సురేశ్ కుమార్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాగా నిందితుడు రాజేంద్రప్రసాద్ పరారీలో వున్నాడని, అతని కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా ఆస్పత్రి తరలించారు.