Share News

తప్పని డోలీ మోత

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:00 AM

గిరిజన గ్రామాలలో అత్యవసర సమయాల్లో డోలీ మోత తప్పడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులను తరలించేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కిలోమీటర్ల మేర డోలీపై మోసుకురావలసి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బొంగరం పంచాయతీ శివారు కుంబుర్ల గ్రామానికి రహదారి లేకపోవడంతో శుక్రవారం గర్భిణిని డోలీపై ఆస్పత్రికి తరలించారు.

తప్పని డోలీ మోత
గర్భిణి కాంచనను డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న గ్రామస్థులు

గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారం

రోడ్డు సౌకర్యం లేక రాలేకపోయిన అంబులెన్స్‌

డోలీపై గోమంగి పీహెచ్‌సీకి తరలించిన గ్రామస్థులు

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి

పెదబయలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంగరం పంచాయతీ శివారు కుంబుర్ల గ్రామానికి చెందిన వంతాల చిట్టిబాబు భార్య కాంచనదేవి నిండు గర్భిణి. ఆమెకు శుక్రవారం పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో రాలేమని అంబులెన్స్‌ సిబ్బంది తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను డోలీపై కొండలు, వాగులు దాటించి కొత్తూరు జంక్షన్‌కు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో గోమంగి పీహెచ్‌సీకి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేరడంతో వైద్యుల పర్యవేక్షణలో పండంటి మగ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. సమయానికి తీసుకురావడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చైతన్య, సంతోష్‌ తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని బొంగరం పంచాయతీ శివారు కుంబుర్ల గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు అత్యవసర సమయాల్లో నానా అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:00 AM