చెత్త సమస్య మోక్షం లేదా!
ABN , Publish Date - May 02 , 2026 | 12:27 AM
జోనల్ కార్యాలయం ఆవరణలో పేరుకుపోయిన చెత్త
డంపింగ్ యార్డును తలపిస్తున్న జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణ
ట్రాన్సిట్ యార్డుకు స్థల సేకరణను పట్టించుకోని అధికారులు
నిత్యం ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, స్థానికులు
అనకాపల్లి టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణ చెత్త కుప్పలతో నిత్యం డంపింగ్ యార్డును తలపిస్తున్నది. కంపోస్టు యార్డు లేకపోవడంతో పట్టణంలో సేకరించిన చెత్తను, జోనల్ కార్యాలయం ఆవరణలో పడేస్తున్నారు. ఇక్కడి నుంచి భారీ వాహనాల ద్వారా విశాఖలోని కాపులుప్పాడకు రవాణా చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ కావడంతో.. ఇక్కడ ఎప్పుడు చూసినా చెత్తపేరుకుపోయి మినీ డంపింగ్ యార్డును తలపిస్తున్నది. ట్రాన్సిట్ డంపింగ్ యార్డుకు స్థల సేకరణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అనకాపల్లి పట్టణంలో రోజూ వంద టన్నుల వరకు చెత్త ఉద్భవిస్తుంది. మునిసిపాలిటీగా వున్నప్పుడు పట్టణ శివారులోని శారదానగర్ యర్ర చెరువు వద్ద డంపింగ్‌యార్డు ఉండేది. కాలక్రమేణా అక్కడ నివాసాలు పెరగడం, శారదా నగర్‌వాసులు ఆందోళనలు చేయడంతో సుమారు 15 ఏళ్ల క్రితం కంపోస్టుయార్డును ఎత్తివేశారు. డంపింగ్ యార్డు కోసం పలుచోట్ల స్థలాలను పరిశీలించినప్పటికీ స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక్కడి చెత్తను విశాఖ నగర శివారులోని కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించడం మొదలుపెట్టారు. అయితే పట్టణంలో సేకరించిన చెత్తను తొలుత జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలోకి చేర్చి, ఇక్కడ భారీ వాహనాల్లోకి లోడింగ్ చేసి కాపులుప్పాడు పంపుతున్నారు. అయితే జోనల్ కార్యాలయంలో చెత్తను తాత్కాలింగ్ డంప్ చేయడం వల్ల తీవ్ర దుర్వాసనతో ఉద్యోగులతోపాటు చుట్టుపక్కల నివసిస్తున్నవారు, మెయిన్‌రోడ్డులోని జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త ట్రాన్సిట్ హాల్ట్ కోసం పట్టణ శివారులో ఎక్కడైనా స్థలాన్ని చూడాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కొన్నిసార్లు రెండు, మూడు రోజులపాటు చెత్తను ఇక్కడి నుంచి తరలించరు. ఈ సమయంలో చెత్తాచెదారం కొండలా పేరుకుపోయి, తీవ్రదుర్వాసన వస్తున్నదని, ఈగలు, దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో చెత్త ట్రాన్సిట్ కేంద్రాన్ని ఎత్తివేయాలని, మరోచోటుకు చెత్తను తరలించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.