పనులయ్యాయి.. బిల్లులు ఏవీ?
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:39 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.
పల్లెపండుగ-2 కింద 1,416 పనులుపూర్తి
రూ.151.36 కోట్ల బిల్లులు అప్‌లోడ్
రెండు నెలలు అయినా విడుదలకాని నిధులు
మిగిలిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ల విముఖం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో పల్లెపండుగ-2 కార్యక్రమం కింద ఉపాధి హామీపథకం నిధులతో జిల్లాలో 1,830 పనులు చేపట్టేందుకు అధికారులు అప్పట్లో ప్రతిపాదించారు. సిమెంటు రహదారులకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మంజూరుచేసి, పీఆర్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పలు గ్రామాల్లో అధ్వానంగా వున్న రహదారులు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలోగా పూర్తిచేసి, బిల్లులు అప్‌లోడ్ చేసిన పనులకు మార్చి నెలాఖరునాటికి బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వెల్లడించారు. దీంతో ఫిబ్రవరి నాటికి పూర్తిచేసిన 1,384 సీసీ రోడ్లు, 26 బీటీ రోడ్లు, గిరిజన గ్రామాల్లో ఆరు కచ్చా రహదారుల నిర్మాణ పనులు కలిపి మొత్తం 1,416 పనులకు సంబంధించి రూ.151.36 కోట్ల మేర బిల్లులను అప్‌లోడ్ చేశారు. సుమారు రెండు నెలలు గడిచినప్పటికీ నిధులు విడుదల కాలేదు. దీంతో మిగిలిన 414 పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల్లో ఎక్కువ శాతం సొమ్మును కూలీలకు కేటాయించడం వల్ల మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతున్నట్టు తెలిసింది. దీనిపై డ్వామా పీడీ సీహెచ్ నిర్మలాదేవిని వివరణ కోరగా.. పూర్తయిన పనులకు సంబంధించి పీఆర్ ఇంజనీర్ల ద్వారా బిల్లులు అప్‌లోడ్ చేశామని, వారం రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం వుందని చెప్పారు.