Share News

గోతులమయమైన పాలగెడ్డ రహదారి

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:50 AM

జీకేవీధి మండలం ఆర్వీనగర్‌-పాలగెడ్డ రహదారిలో ప్రయాణం నరకానికి దారిలా తయారైంది. ఈ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. ప్రతి రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులుగానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదు.

గోతులమయమైన పాలగెడ్డ రహదారి
ధారకొండ రోడ్డులో మెటల్‌ వేసి వదిలేయడంతో కారు టైర్లలోకి వెళ్లిన రాళ్లు

అనునిత్యం ప్రమాదాలే..

క్షతగాత్రులుగా మారిన ఎంతో మంది ప్రయాణికులు

రోడ్డు పనులు అంటూ తవ్వేశారు.. తర్వాత కనిపించకుండా పోయారు

బాగు చేయాలంటూ ప్రజలు వేడుకోలు

సీలేరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆర్వీనగర్‌-పాలగెడ్డ రహదారిని 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో గోతులమయమైంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆందోళనలు, నిరసనలు తెలిపినా అధికారులు స్పందించడం లేదు. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక వాహనాలు మరమ్మతులకు గురై వాహనదారులు పడే బాధలు వర్ణణాతీతం. ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరగ్గొట్టుకొని ఆసుపత్రిపాలయ్యారు. ఈ రోడ్డుపై అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ప్రస్తుత జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ ప్రయాణించారు. ఈ రోడ్డుపై ప్రయాణం ఎలా ఉంటుందో వారు స్వయంగా చూశారు. అయినా పట్టించుకోవడం లేదు. ఇటీవల సీలేరులో వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు జేసీ శ్రీపూజ వచ్చినప్పుడు స్థానికులు ఆర్వీనగర్‌-పాలగెడ్డపై ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు శూన్యమని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ అధికారులకు ఎన్నో సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయినా స్పందన లేదు. అయితే అధికారులు ఈ రహదారికి రూ.18.5 కోట్లు మంజూరు చేశామని చెప్పి గత ఏడాది సెప్టెంబరులో రోడ్డు పనులు ప్రారంభించారు. ఉన్న రోడ్డును పూర్తిగా తవ్వేశారు. తర్వాత కాంట్రాక్టరు గానీ, అధికారులు గానీ కనిపించలేదు. రోడ్డు పనులపై పత్రికల్లో కథనాలు రావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రంగప్రవేశం చేసి ఈ రోడ్డును నెల రోజుల్లో పూర్తి చేస్తామని పత్రికా ప్రకటనలు గుప్పించి మాయమయ్యారు. అంతే.. రహదారి పనులు ముందుకు సాగలేదు. ఇటీవల కాంట్రాక్టర్‌ ధారాలమ్మ ఘాట్‌లో 20ఎంఎం మెటల్‌ పోసి వదిలేశారు. కనీసం దానిపై క్రషర్‌ బుగ్గి గాని, గ్రావెల్‌ గానీ వేయలేదు. దీంతో వాహనాలు మెటల్‌ రోడ్డుపై వెళుతుంటే పక్కకు జారిపోతున్నాయి. ద్విచక్రవాహనదారులైతే ప్రమాదం జరగకుండా వెళ్లలేరు.. అలా తయారైంది.. రోగులను తరలించేటప్పుడు అంబులెన్స్‌ డ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం ఉదయం ఒక కారు ధారకొండ నుంచి చింతపల్లికి వెళుతుండగా రోడ్డుపై వేసిన రాళ్లు కారు టైర్ల మధ్య ఇరుక్కున్నాయి. దీంతో కారు నిలిచిపోయింది. ఒక పక్క మండుటెండలో రాళ్లు తీయడానికి అందులో ప్రయాణిస్తున్న మహిళలు పడిన బాధలు వర్ణణాతీతం. ఈ రహదారిలో నిత్యం ప్రమాదం జరగకుండా ఇంటికి చేరడం గగనమైపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి ఆర్వీనగర్‌-పాలగెడ్డ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 12:50 AM