Share News

గిరిజనుల సంక్షే మానికి ఊతం!

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:35 PM

కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది.

గిరిజనుల సంక్షే మానికి ఊతం!
అంగన్‌వాడీ కేంద్రంలో సేవలందిస్తున్న వైద్యారోగ్య, మహిళ, శిశు సంక్షేమ శాఖల సిబ్బంది(ఫైల్‌)

బడ్జెట్‌లో గిరిజన సంక్షేమ శాఖకు రూ.9,190 కోట్లు

గతేడాదితో పోల్చితే 12.6 శాతం నిధులు పెంపు

విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్‌,

మహిళా, శిశు సంక్షేమానికి ఆశాజనకంగా కేటాయింపులు

గిరిజనులకు మేలు చేసే బడ్జెట్‌

అంటున్న ప్రజానీకం, కూటమి శ్రేణులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. గతేడాది బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.8.159 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది 9,190 కోట్లు కేటాయించింది. దీంతో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 12.6 శాతం నిఽధులు పెంచింది. దీంతో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చూపిన శ్రద్ధ స్పష్టమవుతోంది. గతంలో వైసీపీ పాలనలో గిరిజన సంక్షేమ శాఖకు రూ.6 వేల కోట్లు వరకు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ, వాటిని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం వ్యయం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఇతర పథకాలకు మళ్లించడంతో వైసీపీ ఐదేళ్ల పాలనలో గిరిజనాభివృద్ధికి బాటలు పడలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావాలని, డోలి కష్టాలు తీరాలని భావించి పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్య రంగాల్లోనూ, గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజన సంక్షేమ శాఖకు రూ.9,190 కోట్లు కేటాయించడం విశేషం.

గిరిజనులకు మేలు

అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన గిరిజన ప్రాంతానికి అధిక కేటాయింపులే కాకుండా మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, వ్యవసాయ శాఖలకు చక్కగానే నిధులు కేటాయించింది. ఆయా శాఖల ద్వారా గిరిజన ప్రాంతంలోని ప్రజానీకానికి మేలు జరుగుతుందని కూటమి నాయకులు అంటున్నారు. బడ్జెట్‌లో పాఠశాల విద్యాశాఖకు రూ.32,308 కోట్లు, వైద్యారోగ్యానికి రూ.19,306 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామాభివృద్ధి శాఖకు రూ.22,942 కోట్లు, మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ.4,582 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించారు. ఆయా రంగాలకు ఆశించిన స్థాయిలో నిధులను కేటాయించడం ద్వారా, గిరిజన ప్రాంతంలో విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, వ్యవసాయం, మహిళా, శిశు సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని వారంటున్నారు. అటు గిరిజన సంక్షేమ శాఖకు, ఇటు ఇతర శాఖలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఆశాజనకంగా ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 14 , 2026 | 11:35 PM