విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఓ బ్రాండ్
ABN , Publish Date - May 31 , 2026 | 01:00 AM
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఓ బ్రాండ్ ఉందని, దానిని అంతా కలిసి నిలబెట్టాలని ఉక్కు ఉద్యోగులకు సీఎండీ ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు.
అంతా సహకరిస్తే మళ్లీ పూర్వ వైభవం
వచ్చే ఏప్రిల్ నుంచి లాభాల్లోకి...
సీఎండీ ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్
ఉద్యోగుల పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరు
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఓ బ్రాండ్ ఉందని, దానిని అంతా కలిసి నిలబెట్టాలని ఉక్కు ఉద్యోగులకు సీఎండీ ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్లాంటును లాభాల్లోకి తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేయగా, సీఎండీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు మూడు దశాబ్దాలు ప్లాంటు కోసం అహర్నిశలూ శ్రమించి పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు హాజరు కావడం సీఎండీగా తన కనీస బాధ్యత అన్నారు. తాను సూటు, బూటు వేసుకొని ప్రత్యేకంగా ఏమీ లేనని, మీలో ఒకడినేనన్నారు. ప్లాంటు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని, రోజులు బాగా లేవన్నారు. అంతా అండగా ఉండి, సహకారం అందిస్తే ఈ అడ్డంకులన్నీ అధిగమించి ప్లాంటుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. అప్పుడు ‘మీకు నేను జీవితాంతం అండగా ఉంటాను’ అని మాట ఇచ్చారు. ఇటీవల కాలంలో ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమానికి సీఎండీ స్థాయి అధికారి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు తెలుగు అధికారి అయిన ప్రభాకర్ హాజరు కావడమే కాకుండా, కష్టాలన్నీ తనకు తెలుసునని, పూర్తి సహకారం అందిస్తామని చెప్పడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి.