Share News

వెలుగుచూడని కాకరపాడు గుహ

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:24 PM

మండలంలోని మారుమూల పైనంపాడు పంచాయతీ పరిధిలోని కాకరపాడు గుహ బాహ్య ప్రపంచానికి పరిచయం కాకపోవడంతో వెలుగులోకి రాకుండాపోయింది.

వెలుగుచూడని కాకరపాడు గుహ
కాకరపాడు గుహ లోపలి భాగం

బొర్రాగుహలు బయటపడినప్పుడే గుర్తించినా రోడ్డు సౌకర్యం లేక మరుగునపడిన వైనం

అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

ప్రస్తుతం రోడ్డు పనులు శరవేగంగా జరుగుతుండడంతో ఆదివాసీల్లో ఆశలు

అనంతగిరి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పైనంపాడు పంచాయతీ పరిధిలోని కాకరపాడు గుహ బాహ్య ప్రపంచానికి పరిచయం కాకపోవడంతో వెలుగులోకి రాకుండాపోయింది. వాస్తవానికి బొర్రాగుహలు వెలుగు చూసినప్పుడే ఈ గుహ కూడా బయటపడిందని, అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో దీని గురించి బయట ప్రపంచానికి తెలియలేదని పూర్వీకులు చెబుతుండేవారని గ్రామస్థులు తెలిపారు.

కాకరపాడు గ్రామం నుంచి కిలోమీటరు మేర కొండపై ట్రెక్కింగ్‌ చేసుకుంటూ వెళితే గుహకు చేరుకోవచ్చునని, గుహ లోపల సుమారు 500 మీటర్లకు పైగా సందర్శించవచ్చునని, అయితే ఇంకా లోపలకు సొరంగం విస్తరించి ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. గుహ లోపల మట్టిదిబ్బలను తొలగిస్తే సొరంగం చాలా దూరం వరకు ఉంటుందని అంటున్నారు. దీనిని అభివృద్ధి చేస్తే బొర్రాగుహలు తరహాలో గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. కాగా పైనంపాడు పంచాయతీ ఎగువశోనభ నుంచి కాకరపాడు వరకు 3.2 కిలోమీటర్ల మేర రూ.3.17 కోట్లతో రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే గుహ వద్దకు సులువుగా చేరుకోవచ్చు.

గుహకు వెళ్లేందుకు మూడు మార్గాలు

అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాలకు సరిహద్దులో పైనంపాడు పంచాయతీ ఉండడంతో గుహ వద్దకు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. అనంతగిరి మండలం డముకు-నిమ్మలపాడు మీదుగా పైనంపాడు జంక్షన్‌ నుంచి కాకరపాడు వరకు 25 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అరకులోయ మండలం చొంపి మీదుగా బస్కీ, అలాగే పైనంపాడు నుంచి కాకరపాడుకు సుమారు 25 కిలోమీటర్లు ఉంటుంది. డుంబ్రిగుడ మండలం కించుమండ నుంచి కొర్రా మీదుగా కాకరపాడుకు సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది.

Updated Date - Aug 16 , 2026 | 11:24 PM