Share News

తొలగని వరద.. అన్నదాత వ్యధ

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:02 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పెద్దేరు నది ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని పలు గ్రామాల వద్ద గట్లకు గండ్లు పడ్డాయి. దీంతో చాకిపల్లి, కన్నంపాలెం, జన్నవరం, రామజోగిపాలెం, బెన్నవోలు, పీఎస్‌పేట, భోగాపురం తదితర గ్రామాల్లో వరి, చెరకు, సరుగుడు, ఇతర పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. పెద్దేరు నదిలో వరద ఉధృతి కొనసాగుతుండడం, బుధవారం నుంచి ముంపులోనే వుండడంతో వరి పంట లేనట్టేనని ఆయా రైతులు వాపోతున్నారు.

తొలగని వరద.. అన్నదాత వ్యధ
ఇది రిజర్వాయర్‌ కాదు.. చోడవరం మండలం చాకిపల్లి వద్ద మూడు రోజుల నుంచి వరద ముంపులో ఉన్న వరి పొలాలు, చెరకు తోటలు

తొలగని వరద.. అన్నదాత వ్యధ

పెద్దేరు నదిలో కొనసాగుతున్న ఉధృతి

వేలాది ఎకరాల్లో నీట మునిగిన వరి, చెరకు, ఇతర పంటలు

మూడు రోజుల నుంచి ముంపులోనే ఉండడంతో ఆశలు వదులుకున్న రైతులు

ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం, వర్షాలు తగ్గినప్పటికీ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు తొలగలేదు. ప్రధానంగా నదులకు ఆనుకొని వున్న మాడుగుల, చోడవరం, బుచ్చెయ్యపేట, అననకాపల్లి, రాంబిల్లి మండలాల్లో ముంపు ప్రభావం అధికంగా వుంది. మూడు రోజుల నుంచి వరి పైరు కనిపించనంతగా నీరు నిలిచింది. దీంతో పైరు కుళ్లిపోయి, తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

చోడవరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పెద్దేరు నది ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని పలు గ్రామాల వద్ద గట్లకు గండ్లు పడ్డాయి. దీంతో చాకిపల్లి, కన్నంపాలెం, జన్నవరం, రామజోగిపాలెం, బెన్నవోలు, పీఎస్‌పేట, భోగాపురం తదితర గ్రామాల్లో వరి, చెరకు, సరుగుడు, ఇతర పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. పెద్దేరు నదిలో వరద ఉధృతి కొనసాగుతుండడం, బుధవారం నుంచి ముంపులోనే వుండడంతో వరి పంట లేనట్టేనని ఆయా రైతులు వాపోతున్నారు. చోడవరం నుంచి కన్నంపాలెం, చాకిపల్లి, రామజోగిపాలెం ప్రాంతాలకు అతికష్టంమీద రాకపోకలుసాగాయి. రోడ్డుకు ఇరువైపులా పంటపొలాలు నీటితో నిండిపోయి జలాశయాలను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఐదారు అడుగుల మేర నీరు నిల్వ వుంది. వరి సాగుకు ఇంతవరకు ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి అయ్యింది, ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని కన్నీంటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా అనకాపల్లి మండలంలో తుమ్మపాల, శంకరం, ఆవఖండం తదితర ప్రాంతాల్లో శుక్రవారం కూడా పంటపొలాలు వరద ముంపులోనే వున్నాయి. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేశారు.

మాడుగుల మండలంలో...

మాడుగుల రూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పెద్దేరు నదితోపాటు పలు గెడ్డలు, వాగులు వరద నీటితో పోటెత్తాయి. పెద్దేరు జలాశయం నుంచి బుధవారం రాత్రి భారీమొత్తంలో వరద నీటిని విడుదలచేయడంతో ఆ ప్రభావం మండలంలోని పలు గ్రామాలపై పడింది. నదికి ఆనుకొని, లోతట్టు ప్రాంతాల్లోని వరి పొలాలు పూర్తిగా నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. మూడో రోజైన శుక్రవారం కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. పొట్ట, పాలుపోసుకునే దశలో వున్న వరిపైరు మూడు రోజులపాటు పూర్తిగా నీటిలో మునిగి వుండడంతో కుళ్లిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం కొనసాగడంతోపాటు శుక్రవారం మరోసారి భారీ వర్షం పడడంతో పొలాల్లో నీరు బయటకుపోయే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన తమకు, తుఫాన్‌ తీవ్రనష్టాన్ని మిగిల్చిందని వాపోతున్నారు.

రాంబిల్లి మండలంలో....

రాంబిల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో మేజర్‌, మైనర్‌ శారదా నదుల్లో శుక్రవారం కూడా వరద ఉధృతి కొనసాగింది. దీంతో పంట పొలాల్లో నుంచి వర్షం నీరు నదుల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు వాపోతున్నారు. గోకివాడ, మూలజంప, మామిడివాడ, వెల్చూరు, రజాల, మర్రిపాలెం, కట్టుబోలు దిమిలి, రాజుకోడూరు, తదితర గ్రామాల్లో వరి పొలాలు మూడు రోజుల నుంచి ముంపులోనే ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. వరద ముంపు కారణంగా పంటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనావేసి ఉన్నతాధికారులను నివేదిస్తామని మండల వ్యవసాయాధికారి సుమంత తెలిపారు.

Updated Date - Oct 31 , 2026 | 01:02 AM