జీవీఎంసీలో త్రిమూర్తుల దందా!
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:11 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ముగ్గురు నేతల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చికెన్‌వేస్ట్ కాంట్రాక్టర్ల నుంచి నెలవారీ వసూళ్లు
ఒక్కోజోన్ నుంచి నెలకు రూ.లక్ష చొప్పున డిమాండ్
అధికారులకు ఇవ్వాలంటూ మరికొంత సేకరణ
చేపల చెరువులకు తరలించేందుకు సహకారం
కూటమి నేతలు కావడంతో అధికారుల మౌనం
(విశాఖపట్నం,ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ముగ్గురు నేతల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీలో వైసీపీ పాలకవర్గం ఉండగా ఆ పార్టీకి చెందిన కొందరు వ్యవహరించినట్టే ఇప్పుడు కూటమిలోని ముగ్గురు కీలక నేతల హవా కొనసాగుతోందంటున్నారు. జీవీఎంసీలో కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లపర్వానికి తెరతీసినట్టే... చికెన్‌వ్యర్థాల తరలింపు కాంట్రాక్టర్ల నుంచి కూడా వీరు నెలవారీ మామూళ్లు వసూలుచేస్తున్నారని కూటమి కార్పొరేటర్లే ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులకు ఇవ్వాలంటూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే జీవీఎంసీలో హాట్‌టాపిక్‌గా మారింది.
జీవీఎంసీ పరిధిలో సుమారు 2,500కి పైగా చికెన్ దుకాణాలున్నాయి. వాటి నుంచి ప్రతిరోజూ సగటున 40 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతాయి. ఆదివారం, ప్రత్యేక రోజుల్లో 80 టన్నుల వరకు ఉంటాయి. వీటిని దుకాణం నిర్వాహకులు డంపర్‌బిన్లలో లేదంటే గెడ్డల్లో పడేసేవారు. దీనివల్ల దుర్గంధం, దోమలవ్యాప్తితోపాటు అనారోగ్యసమస్యలు తలెత్తతుండడంతో సేకరించి, కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తాన్నిచికెన్ దుకాణాల నిర్వాహకుల ట్రేడ్‌లైసెన్స్ రూపంలో వసూలుచేసేది. కొంతకాలానికి చికెన్‌వ్యర్థాలను చేపల మేతగా వేసేందుకు పెంపకందారులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. వారి నుంచి డిమాండ్ పెరగడంతో నగరంలో చికెన్ వ్యర్థాలను సేకరించే కాంట్రాక్టర్లు వీరికి విక్రయించడం ప్రారంభించారు. దీనివల్ల భారీగా ఆదాయం వస్తుండడంతో వ్యర్థాల సేకరణకు పోటీపెరిగింది. ఈ టెండరు కోసం కొంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు. ఇందుకోసం రూ.లక్షలో లంచం ఆఫర్‌చేసేవారు. కాగా చేపలకు చికెన్ వ్యర్థాలు వేస్తే వాటిని తిన్న వారికి కేన్సర్, జీర్ణాశయసమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించడంతో అధికారులు దృష్టిసారించారు.
డంపింగ్‌యార్డుకు పది టన్నులే
చికెన్‌వ్యర్థాలను కచ్చితంగా డంపింగ్‌యార్డుకే తరలించేలా కమిషనర్ కేతన్‌గార్గ్ చర్యలు తీసుకున్నప్పటికీ రోజుకి కేవలం పది టన్నులు మించి చేరడం లేదు. ఆదివారాల్లో మరో ఐదు, పది టన్నులు పెరుగుతోంది. మిగిలిన వ్యర్థాలన్నీ చేపలచెరువులకే తరలిపోతున్నాయి. కాగా చికెన్‌వ్యర్థాలను విక్రయించేందుకు అధికారులే సహకరిస్తున్నారనే అభియోగంపై చీఫ్‌వెటర్నరీ అధికారిని మాతృశాఖకు సరండర్ చేశారు. వార్డు సచివాలయం పరిధిలో దుకాణాలు, రోజూ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు శానిటేషన్ సెక్రటరీలతో సర్వే చేయించారు. అధికారుల వద్ద రిజిస్టరైన వాహనాలతో సేకరించేలా బాధ్యతలను అప్పగించారు. అవి డంపింగ్‌యార్డుకు చేరే వరకు డ్రైవర్ సెల్‌ఫోన్ లైవ్ లొకేషన్‌ను సచివాలయం కార్యదర్శులు ట్రాకింగ్ చేయాలని, డంపింగ్‌యార్డులో వ్యర్థాలు తూకం వేసి రికార్డులో నమోదుచేయాలని కమిషనర్ ఆదేశించారు. వాహనాన్ని మళ్లిస్తే పట్టుకుని కేసు నమోదుచేసేలా ప్రజారోగ్యవిభాగం అధికారులు, పోలీస్, రెవెన్యూశాఖల సహకారం కోరారు. దీంతో కొంతవరకు కాంట్రాక్టర్లకు ముకుతాడు పడింది.
త్రిమూర్తుల జోక్యంతో
అయితే జీవీఎంసీ పాలకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు నేతలు చికెన్ వ్యర్థాల కాంట్రాక్టర్లకు అండగా రంగంలోకి దిగారు. కమిషనర్ కేతన్‌గార్గ్‌పై ఒత్తిడితెచ్చి నిఘాను తగ్గించేలా చేశారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఒక్కో జోన్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.లక్ష చొప్పున నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని, అధికారులకు ఇవ్వాలంటూ అదనంగా తీసుకుంటున్నారని కూటమి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రతి నెలా 20వ తేదీన అందజేయాలని షరతు విధించడంతో కాంట్రాక్టర్లలో ఒకరు ఆ బాధ్యత తీసుకున్నారంటున్నారు. ఇటీవల ఓ కార్మిక సంఘం భారీకార్యక్రమాన్ని నిర్వహించగా, దానికి విరాళం ఇవ్వాలని చికెన్‌వ్యర్థాల కాంట్రాక్టర్ల నుంచి రూ.మూడు లక్షలు త్రిమూర్తులే వసూలుచేశారని ప్రజారోగ్యవిభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు. జీవీఎంసీలో అన్ని రకాల పనులుచేసే కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మరికొందరు కార్పొరేటర్లు వారిని నిలదీసినట్టు సమాచారం. ఈ విషయంపై జీవీఎంసీలో పెద్దచర్చ జరుగుతోంది.