కైలాసగిరిపై సిద్ధమవుతున్న త్రిశూలం
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:49 AM
కైలాసగిరిపై త్రిశూలం, డమరుకం నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి.
తుదిదశకు పనులు
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
కైలాసగిరిపై త్రిశూలం, డమరుకం నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూ.1.55 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఉగాది నాటికే పూర్తికావలసి ఉంది. అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇక్కడ 55 అడుగుల ఎత్తైన త్రిశూలం నిర్మాణానికి గత ఆగస్టులో శంకుస్థాపన చేశారు. నగరంలో ఎక్కడి నుంచి చూసినా కనిపించేలా ఏర్పాటుచేస్తున్నామని, ఇది విశాఖకు మరో పర్యాటక ఆకర్షన అవుతుందని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీలైనంత త్వరగా పూర్తిచేసి సందర్శకులకు అందుబాటులోకి తెస్తామన్నారు.
జీవీఎంసీ కమిషనర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా
డబ్బులు అవసరమని అధికారులకు మెసేజ్‌లు
ఎవరూ స్పందించవద్దని కేతన్‌గార్గ్ విజ్ఞప్తి
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేరుతో (62831-7219-6516 నంబర్) సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. వాట్సాప్ డీపీగా జీవీఎంసీ కమిషనర్ కుర్చీలో కూర్చొనివున్న ఫొటోను పెట్టారు. ‘హాయ్...హలో’ అంటూ జీవీఎంసీలో పనిచేస్తున్న అధికారులతోపాటు కేతన్‌గార్గ్‌కు పరిచయస్తులైన వారికి వాట్సాప్ మెసేజ్‌లు చేయడం ప్రారంభించారు. అవతలివారు నిజంగానే కమిషనర్ కేతన్‌గార్గ్ మెసేజ్ చేశారని భావించి స్పందించగానే ‘నాకు అత్యవసరంగా డబ్బులు అవసరం పడింది. తర్వాత వెనక్కి ఇచ్చేస్తాను. సహాయం చేసిపెట్టండి’ అంటూ మెసేజ్ వస్తోంది. దీంతో కొందరు విషయాన్ని కమిషనర్ కేతన్‌గార్గ్‌కు చేరవేయడంతో ఆయన అప్రమత్తమయ్యారు. తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతాను తెరిచారని పేర్కొంటూ...అందుకు సంబంధించిన మెసేజ్‌ల స్ర్కీన్ షాట్‌లను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారు. తాను సహాయం కోరినట్టు ఎవరైనా మెసేజ్‌లు చేసినా, ఫోన్‌కాల్‌చేసినా స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని కేతన్‌గార్గ్ విజ్ఞప్తి చేశారు.
పన్ను వసూళ్లలో రెండో స్థానం
జిల్లాలోని 79 పంచాయతీల ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ.11.22 కోట్లు రాబడి
లక్ష్యం రూ.11.8 కోట్లు
బకాయిలు రూ.60 లక్షలు
అందులో ఒక వ్యాపారి నుంచి రావలసిందే రూ.20 లక్షలు
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీల్లో పన్ను వసూళ్లలో గడచిన ఆర్థిక సంవత్సరం విశాఖ జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. మార్చి నెలాఖరునాటికి జిల్లాలో రూ.11.8 కోట్లకు గాను రూ.11.22 కోట్లు వసూలు చేయగా, ఇంకా రూ.58 లక్షలు బకాయిలుగా ఉండిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం జిల్లాలోని 79 పంచాయతీల నుంచి రూ.11.8 కోట్లకుగాను రూ.11.22 కోట్లు (95.04 శాతం) వసూలయ్యాయి. బకాయిలు రూ.1.91 కోట్లకుగాను రూ.1.68 కోట్లు (86.06 శాతం), కరెంట్ డిమాండ్ రూ.9.89 కోట్లలో రూ.9.54 కోట్లు (96.38 శాతం) వసూలు చేశారు. ఇంకా బకాయిలు రూ.23 లక్షలు, కరెంట్ డిమాండ్ నుంచి రూ.35 లక్షలు వసూలు కావల్సి ఉంది.
బకాయిదారుల్లో కొందరు వ్యాపారులు ఉన్నారు. ఆనందపురం మండలంలో ఒక వ్యాపారి సుమారు రూ.20 లక్షలు చెల్లించాలి. వైసీపీ కీలక నేతల ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్న ఆ వ్యాపారి పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. వైసీపీ నేతల నుంచి ఫోన్ రావడంతో సదరు వ్యాపారిని పంచాయతీ అధికారులు వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భీమిలి మండలంలో మూతపడిన జూట్ మిల్లు యజమాని నుంచి పన్ను వసూలుచేసిన అధికారులు, ఆనందపురం మండలంలో కొన్ని వాణిజ్య సంస్థలకు తక్కువగా పన్నులు వేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొండి బకాయిలు వసూలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి ఎంఎన్వీ శ్రీనివాసరావు తెలిపారు. బకాయిలన్నీ వసూలు చేస్తామని, ఎవరినీ వదిలేది లేదని స్పష్టంచేశారు.