పాడేరులో గర్జించిన గిరిజనం
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:17 PM
తమ హక్కులు, చట్టాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం గిరిజనులు గర్జించారు.
జీవో 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్
జిల్లా కేంద్రంలో గిరిజనులతో బహిరంగ సభ
పాడేరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తమ హక్కులు, చట్టాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం గిరిజనులు గర్జించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని టీచర్ పోస్టుల్లో శత శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 3ని పునరుద్ధరించాలని, గిరిజనుల భూములకు రక్షణగా ఉండే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. జీవో 3 రద్దుతో గిరిజన ప్రాంతంలో టీచర్ పోస్టుల భర్తీలో శతశాతం రిజర్వేషన్ కోల్పోయామని, గతేడాది మెగా డీఎస్‌సీలో గిరిజన ప్రాంత టీచర్ పోస్టులను మైదాన ప్రాంతీయులతో భర్తీ చేయడంతో మరింత అన్యాయానికి గురయ్యామన్నారు. అలాగే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవడంతో గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో 3ని పునరుద్ధరిస్తామని 2024లో అరకులోయ సభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బినామీల పేర్లతో ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 1/70 చట్టానికి వ్యతిరేకంగా ఉన్న గిరిజనేతరులపై ఎల్‌టీఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల నేతలు టి.బాబూరావునాయుడు, తెలంగాణ తుడుందెబ్బ అఽధ్యక్షుడు అరుణ్‌కుమార్, ఎం.రాజబాబు, ఎం.ప్రసాదరావు, కె.శ్రీనివాస్, ఎం.కృష్ణారెడ్డి, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాసాడ ఈశ్వరరావు, ప్రధానకార్యదర్శి ముఖిశేషాద్రి, ఏజెన్సీలోని అన్ని మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, గిరిజనులు పాల్గొన్నారు.