పాడేరులో కదంతొక్కిన గిరిజనం
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:27 PM
తమ హక్కులు, చట్టాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పాడేరులో శుక్రవారం గిరిజనులు కదం తొక్కారు.
జీవో 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని భారీ ర్యాలీ
ఐటీడీఏ ముందు నిరసన
జీవో 3, 1/70 చట్టం అమలు పట్టించుకోని ఎంపీ, ఎమ్మెల్యేలు అవసరమా : అప్పలనర్స
సీఎం చంద్రబాబు స్పందించాలి..
లేకుంటే ఆగస్టు 8, 9 తేదీల్లో బంద్
ప్రకటించిన ఆందోళనకారులు
పాడేరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
తమ హక్కులు, చట్టాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పాడేరులో శుక్రవారం గిరిజనులు కదం తొక్కారు. ఉపాధ్యాయ పోస్టుల్లో శత శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 3ని పునరుద్ధరించాలని, గిరిజనుల భూములకు రక్షణగా ఉండే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో గిరిజనులు పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, చట్టాల పరిరక్షణలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. జీవో నంబరు 3ని 2020 ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు రద్దు చేస్తే.. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ జీవో పునరుద్ధరణకు లేదా ప్రత్యామ్నాయ జీవో జారీకి కనీసం కృషి చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నంబరు 3ని పునరుద్ధరిస్తామని 2024లో అరకులోయ సభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ సైతం నేటికీ అమలు కాలేదన్నారు. ఈనెల 24న రంపచోడవరం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో నంబరు 3పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆగస్టు 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని అప్పలనర్స పేర్కొన్నారు. జీవో నంబరు 3 రద్దుతో గిరిజన ప్రాంతంలో టీచర్ పోస్టుల భర్తీలో శతశాతం రిజర్వేషన్ కోల్పోయామని, గతేడాది మెగా డీఎస్‌సీలో గిరిజన ప్రాంత టీచర్ పోస్టుల భర్తీలో మరింత అన్యాయానికి గురయ్యామన్నారు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భాగమైన అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్-1లోనే కొనసాగించాలన్నారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బినామీల పేర్లతో ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం పోరాడతారని తాము గెలిపించిన ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ అసెంబ్లీ వెళ్లడం లేదని, అటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? అని అప్పలనర్స ప్రశ్నించారు. అంతకుముందు పట్టణ వీధుల్లో గిరిజనుల భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లపై జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మలకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పి.బాలదేవ్, పి.సత్యనారాయణ, బైరి నరేశ్, కె.రాధాకృష్ణ, దర్మాన్న పడాల్, కె.కాంతారావు, మోహన్, ధ్రువ, వెంకటరమణ, శశికిరణ్, వై.కుమార్, వి.నాగేశ్వరరావు, హైమావతి, వైసీపీ నేతలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.