వణుకుతున్న మన్యం వాసులు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:18 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతుండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు.
రాత్రికి పెరుగుతున్న చలి తీవ్రత
శీతలగాలులే కారణం
కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతుండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. వాతావరణంలోని మార్పులతో గత రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శనివారం అరకులోయలో 7.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హుకుంపేటలో 8.2, ముంచంగిపుట్టులో 8.9, పెదబయలులో 9.2, కొయ్యూరులో 12.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వణుకుతున్న జనం
ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా కొనసాగుతుండడంతో పాటు శీతలగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో మన్యం వాసులు వణుకుతున్నారు. అలాగే మూడు రోజులుగా పొగమంచు దట్టంగా కురవనప్పటికీ చలి మాత్రం తగ్గడం లేదు. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు.
ముంచంగిపుట్టులో గజగజ
ముంచంగిపుట్టు:
గత కొద్ది రోజులుగా మండలంలో చలి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా మారింది. శనివారం ఉదయం 8 గంటలవుతున్నా పొగమంచు వీడకపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయత్రంం 5 గంటల నుంచే చలి గాలులు మొదలవుతుండడంతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిస్ట స్థాయికి పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. విపరీతమైన చలికి వయసు పైబడిన వారు, చిన్న పిల్లలు తట్టుకోలేక శ్వాసకోశ సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు కురిసే సమయంలో బయటకు వచ్చే వారు విధిగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.