వణుకుతున్న మన్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:42 PM
చలి తీవ్రతకు పాడేరు మన్యం వణుకుతోంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి పెరుగుతోంది. దీంతో గిరిజనులు గజగజలాడుతున్నారు.
పెరుగుతున్న చలి తీవ్రత
ముంచంగిపుట్టు, అరకులో 13.1 డిగ్రీలు
పాడేరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):
చలి తీవ్రతకు పాడేరు మన్యం వణుకుతోంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి పెరుగుతోంది. దీంతో గిరిజనులు గజగజలాడుతున్నారు. శనివారం ఉదయం పది గంటల వరకు మంచు కమ్మేసింది. తర్వాత నుంచి ఎండ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో శీతల వాతావరణం కొనసాగింది. దట్టంగా కమ్మేసిన మంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. కొయ్యూరులో శనివారం 17.0, జీకేవీధి, జి.మాడుగులలో 16.5, పాడేరులో 15.8, హుకుంపేటలో 15, చింతపల్లిలో 14.5, పెదబయలులో 13.7, డుంబ్రిగుడలో 13.3, అరకులోయ, ముంచంగిపుట్టులో 13.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
మండలంలో చలి తీవ్రత ఎక్కువైంది. శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు దట్టంగా కమ్ముకుంది. మండలంలో సుజనకోట, పెదగూడ, దారెల, జోలాపుట్టు, పనసపుట్టు, లక్ష్మీపురం, బూసిపుట్టు తదితర పంచాయతీల పరిధిలోని మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో చలి మరికాస్త ఎక్కువగా ఉంది. మంచు దట్టంగా కమ్ముకోవడంతో ఉదయం వేళల్లో నాటుపడవల సాయంతో గెడ్డలు దాటేందుకు ఎవరూ సాహసించడం లేదు. వివిధ పనుల నిమిత్తం తెల్లవారుజామున బయటకు వచ్చే వారు మంచు బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వారపు సంతలో ఉన్ని దుస్తులకు మంచి గిరాకీ ఏర్పడింది.