Share News

ఎక్కడి చెత్త అక్కడే

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:51 AM

జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు, క్లాప్‌ వాహనాల డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు.

ఎక్కడి చెత్త అక్కడే

జీవీఎంసీ పారిశుధ్య కార్మికుల మెరుపుసమ్మె

డిమాండ్లు పరిష్కరించాలంటూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా

నగరంలో నిలిచిన పారిశుధ్య నిర్వహణ

కదలని క్లాప్‌ వాహనాలు

వీధుల్లో పేరుకుపోయిన కుప్పలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు, క్లాప్‌ వాహనాల డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో వీధుల్లో ఎక్కడచూసినా చెత్త పోగులు కనిపించాయి. జీవీఎంసీ పరిధిలో సుమారు ఆరు వేల మంది అవుట్‌సోర్సింగ్‌పై (ఆప్కాస్‌) పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరుకాకుండా 600 మంది క్లాప్‌ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. అదేవిధంగా క్లాప్‌ వాహనాలకు లోడర్లుగా రోజువారీ వేతనంపై స్వయం సహాయక సంఘాల ద్వారా 600 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా ప్రతిరోజూ తమకు కేటాయించిన వార్డు సచివాలయాల పరిధిలో రోడ్లు శుభ్రం చేయడం, చెత్త సేకరించడం, క్లాప్‌ వాహనాలకు లోడ్‌ చేయడం, డ్రైనేజీల్లో పూడికతీయడం వంటి పనులు చేస్తుంటారు. అయితే తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారంతా యూనియన్‌ నేతల పిలుపుమేరకు మంగళవారం విధులకు హాజరుకాకుండా సమ్మెకు దిగారు. దీంతో వీధుల్లో చెత్త పేరుకుపోయింది. ఉదయాన్నే క్లాప్‌ వాహనాలు రాకపోవడంతో ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను తీసుకొచ్చి సమీపంలో గల డంపర్‌బిన్‌ల వద్ద పడేశారు.

కార్మికులు ఒక్కసారిగా విధులను బహిష్కరించడంతో అధికారులు అప్రమత్తమై సంఘాల నేతలతో చర్చించారు. ఆప్కోస్‌ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న మార్చి నెల జీతం గురించి సీడీఎంఏ అధికారులతో మాట్లాడామని, బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని చెప్పారు. తమ ఇతర డిమాండ్లను కూడఆ నెరవేర్చాలంటూ కార్మికులు ఆందోళనను కొనసాగించారు. మరోవైపు నగరంలో పారిశుధ్య నిర్వహణకు సిబ్బంది కొరత ఉందని గుర్తించిన జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఒక్కో సచివాలయం పరిధిలో ఒక కార్మికుడిని రోజువారీ వేతనం ప్రాతిపదికన తీసుకోవాలని వార్డు సచివాలయం కార్యదర్శులను ఆదేశించారు. దీంతో 578 మంది కార్మికులను నియమించుకునే ప్రక్రియ దాదాపు పూర్తయింది. వీరిలో 300 మంది సోమవారం నుంచి విధుల్లో చేరారు. ఈ పరిణామం యూనియన్‌ నేతలకు మింగుడపడలేదు. తాము కారుణ్య నియామకంపై ఒత్తిడి చేస్తుంటే పట్టించుకోకుండా, తాత్కాలిక కార్మికులను నియమించడం కూడా కార్మికుల మెరుపు సమ్మెకు ప్రధాన కారణంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన

తమ డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించి సమ్మెకు దిగిన కార్మికులు ఉదయం నుంచే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని గేటు ఎదురుగా ఆందోళన చేశారు. సీఐటీయూ అనుబంధంగా పనిచేస్తున్న జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నేతలతో కలిసి జీవీఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పారిశుధ్య నిర్వహణలో పనిచేస్తూ మృతిచెందిన కార్మికులు, 60 ఏళ్ల వయస్సు దాటిపోవడం వల్ల ఖాళీ అయిన పోస్టుల్లో వారి కుటుంబ సభ్యులనే నియమించాలని, జీవో నంబర్‌ 124 ప్రకారం వేతనాలు పెంచాలని, క్లాప్‌ డ్రైవర్లు, ఈ-ఆటోల డ్రైవర్లు, ఎంఎస్‌ఎఫ్‌ వర్కర్లకు వేతనాన్ని రూ.24,500కి పెంచాలని, లోడర్లు, బదిలీ కార్మికులకు రోజువారీ వేతనాన్ని రూ.617కి పెంచాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయం అమలు చేయాలని నినాదాలు చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 12:51 AM