Share News

ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:42 AM

ముహూర్తం ఖరారు

ముహూర్తం ఖరారు
ఆహ్వాన పత్రాన్ని విడుదల చేసిన ఎమ్మెల్యే కొణతాల, ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్‌, ధర్మకర్తలు,

8వ తేదీన నూకాంబిక నూతన ఆలయం ప్రారంభం

ఉదయం 10.58 గంటలకు రాజగోపురంపై పసిడి కలశ ప్రతిష్ఠ

మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం

ఐదో తేదీ నుంచే పలు కార్యక్రమాలు

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వెల్లడి

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణ పనులు పూర్తయినందున మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 10.58 గంటలకు ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించినట్టు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఆలయ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో మొదలైన ఆలయ పునర్నిర్మాణ పనులు ఇప్పటికి పూర్తయ్యాయని చెప్పారు. మొత్తం రూ.12.5 కోట్లు వ్యయమైంని, పీలా గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సుమారు రూ.2.5 కోట్లతో రాజగోపురం నిర్మాణమైందన్నారు. అమ్మవారి నూతన ఆలయం ప్రారంభం సందర్భంగా ఐదో తేదీ నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తొలి రోజున అమ్మవారికి పసిడి కలశాల ఊరేగింపు, ఆరో తేదీన వివిధ పూజా కార్యక్రమాలు, ఏడో తేదీన విగ్రహ వాస్తు పూజ, హోమాలు ఉంటాయన్నారు. ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు వేదపారాయణం, విఘ్నేశ్వర పూజ, అనంతరం 10.58 గంటలకు దేవాలయం రాజగోపురంపై పసిడి కలశ ప్రతిష్ఠ, పూర్ణాహుతి జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నూతన ఆలయంలో భక్తులకు అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం కల్పించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా మంత్రి అనిత, ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, దేవదాయ శాఖ కమిషనర్‌, తదితర ప్రముఖలను ఆహ్వానించినట్లు కొణతాల తెలిపారు. పదో తేదీన కొత్త అమావాస్య జాతర ప్రారంభమవుతుందని, జాతర పూర్తయ్యే వరకు నెల రోజులపాటు నిత్యం పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ఈవో ఎల్‌.శ్రీధర్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:42 AM