Share News

ప్రమాణ స్వీకారానికి వేళాయె

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:40 AM

ప్రమాణ స్వీకారానికి వేళాయె

ప్రమాణ స్వీకారానికి వేళాయె
ఎలమంచిలి మునిసిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన దృశ్యం

- నేడు కొలువుదీరనున్న నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పాలకవర్గాలు

- నర్సీపట్నం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా పద్మావతి, ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా రమాకుమారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

- కౌన్సిలర్లు కూడా...

నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. నర్సీపట్నం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతితో పాటు 40 మంది కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారితో పాటు 32 మంది కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

నర్సీపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం మునిసిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు మునిసిపల్‌ సమావేశ మందిరంలో ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీవో వీవీ రమణ, ఎలక్షన్‌ అథారిటీ, మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర ఆధ్వర్యంలో చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతితో పాటు ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా రాజ్యసభ సభ్యులు విజయ్‌, 40 మంది కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కౌన్సిలర్లు చేతులెత్తి వైస్‌ చైర్మన్‌ని ఎన్నుకుంటారు.

ఎలమంచిలిలో...

ఎలమంచిలి: ఎలమంచిలి మునిసిపల్‌ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మునిసిపల్‌ ప్రత్యేక హాలులో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రిసైడింగ్‌ అధికారి, అడ్డురోడ్డు ఆర్డీవో కేవీ రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవంబరు 1న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌తో పాటు 32 వార్డులకు జరిగిన ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి(బీజేపీ)తో పాటు 12 మంది టీడీపీ, 11 మంది జనసేన, 2 బీజేపీ, ఆరుగురు వైసీపీ, 1 స్వతంత్ర కౌన్సిలర్లు గెలుపొందిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు పాలకవర్గంతో ప్రిసైడింగ్‌ అధికారి మహాలక్ష్మి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మొదటగా చైర్‌పర్సన్‌ రమాకుమారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తరువాత 32 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కౌన్సిలర్లు చేతులెత్తే పద్ధతిలో వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అయితే వైస్‌ చైర్మన్‌గా 31వ వార్డు కౌన్సిలర్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే ఈ పదవి ఆశిస్తున్న వారిలో 1వ వార్డు కౌన్సిలర్‌ కర్రి ఝాన్సీ(జనసేన)కూడా లేకపోలేదు.

చైర్‌పర్సన్‌గా హాట్రిక్‌

ఎలమంచిలి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా మూడవసారి గెలుపొంది పిల్లా రమాకుమారి హ్యాట్రిక్‌ సాధించారు. అలాగే 13వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన సీరా సాయి ప్రసన్న(బీజేపీ)కూడా మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిం చారు. కాగా 7వ వార్డు నుంచి గెలుపొందిన బొడ్డేటి చంద్రరావు(టీడీపీ), 20వ వార్డు నుంచి గెలుపొందిన కట్టమూరు సుజాత(వైసీపీ), 23వ వార్డు కౌన్సిలర్‌ మైచెర్ల కిరణ్‌(టీడీపీ), వీరు ముగ్గురు కౌన్సిలర్లు రెండవసారి పాలకవర్గంలో అడుగుపెడుతున్నారు. మిగిలిన వారంతా నూతన పాలకవర్గానికి కొత్తవారే. నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇప్పటికే మునిసిపల్‌ కార్యాలయం ప్రత్యేక సమావేశం మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Updated Date - Nov 23 , 2026 | 12:40 AM