Share News

రంపుల ఘాట్‌లో ప్రయాణమంటే హడల్‌

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:44 AM

స్థానిక రంపుల ఘాట్‌లో పలు చోట్ల వారం రోజుల క్రితం కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. కానీ అధికారులు ఇప్పటి వరకు వాటిని తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.

రంపుల ఘాట్‌లో ప్రయాణమంటే హడల్‌
రంపుల ఘాట్‌ ప్రారంభంలో రహదారిపై పడిన బండరాయి

- హైవేపై కొండచరియలు, మట్టిపెళ్లలు

- వారం దాటినా తొలగింపు చర్యలు శూన్యం

- వాహనచోదకులకు తప్పని అవస్థలు

చింతపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక రంపుల ఘాట్‌లో పలు చోట్ల వారం రోజుల క్రితం కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. కానీ అధికారులు ఇప్పటి వరకు వాటిని తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు.

రాజమహేంద్రవరం నుంచి రంపుల ఘాట్‌ మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్నది. రంపుల ఘాట్‌లో దాదాపు 90 శాతం పనులను జాతీయ రహదారుల అధికారులు పూర్తి చేశారు. ఘాట్‌లో కొండలను తొలిచి రహదారి నిర్మించడం, పైనుంచి దిగువకు కొండచరియలు పడకుండా రక్షణ గోడ నిర్మించకపోవడం వల్ల చిన్నపాటి వర్షం కురిసినా రహదారిపైకి బండరాళ్లు, మట్టిపెళ్లలు పడుతున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు పలు చోట్ల బండరాళ్లు, మట్టి పెళ్లలు పడ్డాయి. వర్షాలు తెరిపి ఇచ్చి వారం రోజులు కావస్తున్నప్పటికి జాతీయ రహదారుల అధికారులు కొండచరియలు, మట్టిపెళ్లలను తొలగించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో రాత్రి వేళ ఈ ఘాట్‌లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్గంలో కొత్తగా ప్రయాణించే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు స్పందించి కొండచరియలు, మట్టిపెళ్లలను తొలగించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:44 AM