ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - May 27 , 2026 | 12:09 AM
జిల్లాలో మంగళవారం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. తీవ్రవడగాడ్పులు వీచాయి. అయితే నాలుగు గంటల ప్రాంతంలో వాతావరణం మారిపోయింది.
పలు మండలాల్లో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
వాహనాల రాకపోకలకు అంతరాయం
నిలిచిన విద్యుత్ సరఫరా
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
వాతావరణం చల్లబడడంతో ఉపశమనం
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
జిల్లాలో మంగళవారం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఠారెత్తించింది. తీవ్రవడగాడ్పులు వీచాయి. అయితే నాలుగు గంటల ప్రాంతంలో వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు మొదలయ్యాయి. కొద్దిసేపటికి ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్ సిబ్బంది రంగంలోకి దిగి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. గాలుల కారణంగా పూరిళ్లు, రేకుల ఇళ్లకు నష్టం వాటిల్లింది. కాగా వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఉపశమనం చెందారు.
అనకాపల్లి పట్టణంలో సాయంత్రం నాలుగు గంటల తరువాత ఈదురుగాలులు, ఉరుములతో వర్షం కురిసింది. నరసింగరావుపేటలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి వృక్షాన్ని తొలగించారు. గాంధీనగరం వద్ద చోడవరం వెళ్లే రోడ్డపై ఒక చెట్టు కొమ్మలు విరిగాయి. కొన్నిప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మాకవరపాలెం మండలంలో ఈదురు గాలులతో మోస్తరు వర్షం పడింది. తామరంలో రోడ్డు అడ్డంగా తాడిచెట్లు కూలడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో నర్సీపట్నం-తాళ్లపాలెం రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాలింపేట వద్ద రోడ్డుకు అడ్డంగా చెట్టు పడింది. ముసిడిపాలెంలో విద్యుత్ టాన్స్‌ఫార్మర్ కూలింది.
కోటవురట్ల మండలంలోని జల్లూరు, కైలాసపట్నం, కోటవురట్ల, పందూరు, తంగేడు, లింగాపురం తదితర గ్రామాల్లో సుమారు గంటపాటు ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది.
బుచ్చెయ్యపేట మండలంలో సుమారు అర్ధ గంటపాటు ఈదురు గాలులతో మోస్తరు వర్షం కురిసింది. వడ్డాది కొత్తూరులో ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, ఐదు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్ సిబ్బంది రంగంలోకి దిగి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
రావికమతం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. రావికమతంలో ఆర్‌ఈసీ రోడ్డుపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పండింది. పలు గ్రామాల్లో చెట్లు, సుమారు 40 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మాడుగుల మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. అక్కడక్కడ చెట్టుకొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ముకుందపురం పెట్రోలు బంకు వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
దేవరాపల్లి మండలంలో ఈదురు గాలులతో వర్షం పడింది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. సుమారు మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చీడికాడ మండలంలో కూడా మోస్తరు వర్షం కురిసింది.
పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, కశింకోట, తదితర మండలాల్లో ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీచాయి. అక్కడక్కడ కొద్దిపాటి వర్షం పడింది.